Blood Donation: ట్రాన్స్ జెండర్లు ఎందుకు రక్తదానం చేయకూడదు? మనదేశంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Blood Donation: ప్రతి దేశంలో రక్తదానం విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే మనదేశంలో కూడా ఉన్నాయి. భారతదేశంలో ట్రాన్స్ జెండర్లు రక్తదానం చేయకూడదు.
Blood Donation: రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టు. రక్తదాతల కోసం ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువే. అయితే మన దేశంలో అందరూ రక్తదానం చేయడానికి అర్హులు కాదు. ట్రాన్స్ జెండర్లు, స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్లు రక్తదానం చేయకూడదు. వారి నుంచి ఎవరు రక్తాన్ని తీసుకోకూడదు. మనదేశంలో వీరిపై రక్తదానం విషయంలో శాశ్వత నిషేధం ఉంది.
వారిపై ఎందుకు నిషేధం?
కేవలం మనదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో ట్రాన్స్ జెండర్లు, స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్లపై రక్తదానం చేయకుండా నిషేధాన్ని విధించారు. 1980 నుంచి ఈ నిషేధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా నిషేధించడానికి ముఖ్య కారణం హెచ్ఐవి వ్యాప్తిని అడ్డుకోవడమే. వారి ద్వారానే హెచ్ఐవి అధికంగా వ్యాప్తి చెందుతుందని అనేక దేశాల్లోని ప్రభుత్వాలు భావించాయి. అందుకే వారిని రక్తదానం చేయకుండా నిషేధం విధించాయి. మనదేశంలో కూడా ఈ నిషేధం ఉంది.
2011 లెక్కల ప్రకారం మన దేశంలో ట్రాన్స్ జెండర్లు 5 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఇప్పుడు వారి సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇక స్వలింగ సంపర్కుల సంఖ్య పాతిక లక్షలకు పైగానే. వీరందరూ కూడా రక్తదానం ఇవ్వడానికి అర్హులు కాదు. కానీ మన దేశంలో రక్తం కొరత మాత్రం విపరీతంగా ఉంది. ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం పడుతుంది. 2021లో మనదేశంలో ఏడాదికి పది లక్షల యూనిట్ల రక్తం కొరత ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య నాలుగు కోట్ల యూనిట్లకు దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే తమపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టుకు చేరారు ట్రాన్స్ జెండర్లు, స్వలింగ సంపర్కులు. దీనిపై ప్రస్తుతానికి కోర్టులో ఇంకా వాదనలు నడుస్తున్నాయి. ఎలాంటి తీర్పు రాలేదు. తమపై దానం చేయకుండా నిషేధం విధించడం పూర్తిగా వివక్షపూరితమైనదని ఆ వర్గాలు అంటున్నాయి. తమ కమ్యూనిటీలో ఒకరికి హెచ్ఐవి వైరస్ ఉంటే అది మొత్తం అందరికీ ఉన్నట్టు భావించడం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. సాధారణ ప్రజల్లో కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఉన్నారని తమను సాధారణ ప్రజల్లాగే గుర్తించాలని వారు కోర్టుకు విన్నవిస్తున్నారు.
2017 నుంచి భారత ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లు రక్తాన్ని దానం చేయకుండా నిషేధం విధించింది. 2021లో మణిపూర్ కు చెందిన ఒక ట్రాన్స జెండర్ ఆ నిషేధాన్ని ఎత్తి వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఆ పిటిషన్ పై వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.
టాపిక్