Bathukamma Festival : తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబురాలు, తొలి రోజు ఎంగిలి పూలతో వేడుక
Bathukamma Festival : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తొలిరోజు ఎంగిలి పూలతో బతుకమ్మను అలకరించి మహిళలు పండుగను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి భాగమైన ఈ పండుగను మహిళలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో .. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. పసి వయసు నుంచి పండు ముసలి వరకు.. భక్తి శ్రద్దలతో..నవ్వుతూ కేరింతల చప్పట్లు కొడుతూ.. వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మలతో పాటల అల్లికలతో ఆడుకునే పండగ బతుకమ్మ పండగ. తెలంగాణ ఆచార సంప్రదాయమైన ఈ పండుగ ప్రపంచంలో తెలియదంటే అతిశయోక్తి కాదు. అంతటి విశిష్టత గల పండుగ బుధవారం మహాలయ అమావాస్యతో ఎంగిలి పూలతో ఈ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీ.
బతుకమ్మ'పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ, సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.
రక రకాల పూలతో
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయటలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. ఈ సమయంలో రకరకాల పూలు ఒక పెద్ద ఆకర్షణ గా ఉంటాయి. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు
15 రోజులు పండుగే
సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. నెలలలో రెండు పెద్ద పండుగలు జరుపుకుంటారు. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలతో ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు జరుపుతారు.. ఈ నెలలో రెండు పండుగలు దసరా, బతుకమ్మ పండుగలు వస్తాయి. కానీ బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ.
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక
రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి తో పరవశించి పోతారు. గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.
తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీయువకులు పాల్గొంటారు. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
1. ఎంగిలి పూల బతుకమ్మ
2. అటుకుల బతుకమ్మ
3. నానే బియ్యం బతుకమ్మ
4. అట్ల బతుకమ్మ
5.ముద్ద పప్పు బతుకమ్మ
6. అలిగిన బతుకమ్మ
7.వేపకాయల బతుకమ్మ
8.వెన్న ముద్దాల బతుకమ్మ
9. సద్దుల బతుకమ్మ
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.
అయితే చివరి రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ :
చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. చీకటి పడుతుంది అనగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఈ తొమ్మిది రోజులూ, ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మోగుతూనే ఉంటాయి.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ తెలుగు టైమ్స్.
సంబంధిత కథనం