Bathukamma History: బతుకమ్మ పండుగ వెనక వెయ్యేళ్ల చరిత్ర, తొలిసారి ఈ పండుగను నిర్వహించుకున్నది ఆనందంతో కాదు, బాధతో
Bathukamma History: బతుకమ్మ పండుగ గురించి ఎన్నో కథలను చెప్పుకుంటారు. వెయ్యేళ్లనాటి కథ కూడా ప్రజల వాడుకలో ఉంది. బతుకమ్మను తొలిసారి ఎప్పుడు నిర్వహించుకున్నారో తెలుసుకోండి.
Bathukamma History: బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నం. తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు బతుకమ్మలోనే చూస్తున్నారు. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలైందో తొలిసారి ఎందుకు నిర్వహించుకున్నారో చెప్పడానికి మాత్రం ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథలలో వెయ్యేళ్ల నాటి కథ కూడా ఒకటి ఉంది. బతుకమ్మ పుట్టింది ఆనందంతో కాదు, తెలంగాణ ఆడపిల్లల బాధ నుంచే. తమ బాధను తెలియజేయడానికి బతుకమ్మ పండగను వినియోగించుకున్నారు తెలంగాణ మహిళలు.
తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. అయితే క్రీస్తు శకం 973లో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటుల రాజును చంపి తన రాజ్యాన్ని స్థాపించాడు. రాజయ్యాక తైలపాడు ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. 997లోనే మరణించాడు. తైలపాడు కొడుకు అయినా సత్యాస్రాయుడు రాజయ్యాడు. వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయం అప్పట్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రజలు ఆమెని ఎంతగానో నమ్మేవారు తమ కష్టాలను రాజరాజేశ్వరి దేవికి చెప్పుకునేవారు.
చోళ రాజులు కూడా ఆ రాజరాజేశ్వరిని ఎంతో నమ్మేవారు. క్రీస్తుశకం 985 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళుడు పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. ఇతని కుమారుడైన రాజేంద్ర చోళుడు యుద్ధంలో గెలిచి విజయోత్సహాన్ని పొందాడు. తన విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చి అందులో ఉన్న శివలింగాన్ని తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఆ శివలింగాన్ని ప్రతిష్టించి భారీ స్థాయిలో ఆలయాన్ని నిర్మించాడు రాజరాజ చోళుడు. అదే బృహదీశ్వరాలయం.
బతుకమ్మ ఇలా పుట్టింది
అయితే రాజరాజేశ్వరి ఆలయం నుంచి శివలింగాన్ని తీసుకువెళ్లి తంజావూరులో ప్రతిష్టించడం తెలంగాణ ప్రజలకు ఎంతో బాధనిపించింది. ఎందుకంటే శివుడిని తీసుకెళ్లి పార్వతి దేవిని మాత్రం ఇక్కడే వదిలేసారు. శివుడిని, పార్వతిని విడదీసినందుకు తెలంగాణ మహిళలు ఎంతో బాధపడ్డారు. పార్వతీ దేవిని అప్పుడు బృహదమ్మా అని పిలిచేవారు. తమ దుఃఖాన్ని ఆ చోళ రాజులకు తెలియజేయాలని పువ్వులను పేర్చి బతుకమ్మను తొలిసారిగా ఆడినట్టు చెబుతారు చరిత్రకారులు. బృహదమ్మే తర్వాత బతుకమ్మగా మారిందని చెప్పుకుంటారు. అప్పటినుంచి ఏటా బతుకమ్మ పండగను నిర్వహించుకుంటున్నారు తెలంగాణవాసులు.
ఎంతో బాధలో
మరో కథనం ప్రకారం భూస్వాముల పెత్తందారి వ్యవస్థలో తెలంగాణలోని గ్రామీణ మహిళలు ఎంతో చితికిపోయారు. వారు బతుకులు అధ్వానంగా తయారయ్యాయి. వారి భూస్వాముల అకృత్యాలకు వారు నాశనం అయిపోయారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి మహిళలను తలుచుకొని తోటి తెలంగాణ మహిళలు బతుకమ్మ అని దీవిస్తూ పాటలు పాడారని చెప్పుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళలకు ప్రతీకగా బతుకమ్మను నిర్వహించుకుంటారని కూడా చెప్పకుంటారు. ఏది ఏమైనా బతుకమ్మ తొలిసారిగా ఆనందంగా నిర్వహించుకున్న పండుగ కాదు, ఎంతో బాధతో చేసుకున్న పండగ.