తెలంగాణలో ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఎట్టకేలకు అడుగు ముందుకుపడింది. ఓవైపు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ దాదాపు పూర్తైపోయింది. కానీ టీజీ ఎప్‌సెట్ -2024లో భాగంగా ఉన్న ఫార్మసీ కౌన్సెలింగ్ కోసం చాలా మంది విద్యార్థులు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే తాజాగా అధికారులు ప్రవేశాలకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు.
బీ ఫార్మసీ, డీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 25 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. సెప్టెంబర్ 25వ తేదీన వెబ్ ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 27వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు.సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27, 28 తేదీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్ ద్వారా నిర్ణయించిన ట్యూషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. tgeapcetb.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్లు, సీట్ల అలాట్ మెంట్ కాపీలను పొందవచ్చు.
ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మే మాసంలో విడుదలయ్యాయి. కానీ ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ తేదీలు ఖరారు కాలేదు. కాలేజీలకు అనుమతుల విషయంలో ఇటీవలనే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో వెనువెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియను పట్టాలెక్కించారు.
ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఈఏపీసెట్ లోని అగ్రి అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో ఏపీ విద్యార్థులు మెరిశారు. మదనపల్లికి చెందిన ప్రణితకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది. విజయనగరానికి చెందిన రాధాకృష్ణకు రెండో ర్యాంక్ దక్కింది. చిత్తూరు విద్యార్థి రాఘవ్ నాల్గో ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. గతేడాదితో పోల్చితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. అగ్రికల్చర్, అండ్ ఫార్మసీ,ఇంజనీరింగ్ లో అమ్మాయిలదే హవా కొనసాగింది.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లో చూస్తే అబ్బాయిలు 88.25 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు - 90.18 శాతం మంది పాస్ అయ్యారు.మొత్తం 89.66 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు.