TS New Governor: ఝార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ బాధ్యతలు, తమిళసై రాజీనామాకు రాష్ట్రపతి అమోదం
TS New Governor: తెలంగాణ గవర్నర్ తమిళ సై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదించారు. తెలంగాణ బాధ్యతలను ఝార్ఖండ్ గవర్నర్ సీపీకి అప్పగించారు.
TS New Governor: తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా రాధాకృష్ణన్‌కు అప్పగించారు.
మరోవైపు తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళ సై రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదం తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో తమిళసై సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
తమిళనాడు నుంచి చెన్నై సెంట్రల్, కన్యాకుమారి, తుత్తుకూడి పార్లమెంటు నియోజక వర్గాల్లో ఏదొక నియోజక వర్గం నుంచి తమిళ సై లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి బీజేపీ అగ్ర నాయకత్వం అమోదం తెలపడంతోనే ఆమె పదవికి రాజీనామా చేశారు. 2019లో తెలంగాణ రెండో గవర్నర్‌గా తమిళ సై నియమితులయ్యారు. దాదాపు నాలుగున్నరేళ్లకుగా పైగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగారు.
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళ సై రాజీనామా చేయడంపై తమిళనాడు నాయకులు విమర్శలు కూడా గుప్పించారు. ఉప రాష్ట్రపతి పదవి కోసమే గవర్నర్ పదవిని వదులుకున్నారని తమిళనాడు నేతలు ఆరోపించారు.
ఎన్నికల్లో పోటీపై ఊహాగానాలు…
గత కొద్ది రోజులుగా తమిళ సై Lok sabha ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడు తున్నాయి. ఈ వార్తల్ని నిజం చేస్తూ సోమవారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతి అమోదం కోసం పంపించారు. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ Chennai central పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తమిళ సై పోటీకి బీజేపీ అధినాయకత్వం అమోదం తెలపడంతో రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు.
తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో పలుమార్లు విభేదాలు తలెత్తాయి. గవర్నర్‌ను ప్రభుత్వం గౌరవించడం లేదని పలుమార్లు ఆరోపించారు. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని వెనక్కి తిప్పి పంపడం, పెండింగ్‌లో ఉంచడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది.
తమిళనాడుకు చెందిన తమిళ సై వృత్తిరీత్యా వైద్యురాలిగా పనిచేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా నియమించారు. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు పుదుచ్చేరి Puduchhery గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా 18 ఫిబ్రవరి 2021న భాద్యతలు చేపట్టారు.
తమిళ సై ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో, పీజీలో ప్రసూతి, గైనకాలజీ విద్యను డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. సోనాలజీ, ఎఫ్.ఈ.టీ థెరపీలో ఉన్నత విద్యను కెనడాలో పూర్తి చేశారు.
తమిళ సైకు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఎంబీబీఎస్ విద్యను మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేశారు. బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరింది. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007 లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర భారతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 2013 లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014వ సంవత్సరం నుంచి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు.
2006, 2011 లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా పోటీ చేశారు. 2009, 2019 లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. 2024లో చెన్నై సెంట్రల్, తుత్తుకూడి నియోజక వర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. తమిళసై భర్త సౌందరరాజన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే అకాంక్షతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
సంబంధిత కథనం