TG Govt Aasara Pensions : నిధులు పక్కదారి - 5,650 మందికి డబుల్ పెన్షన్లు.! సెర్ప్ నివేదికతో బయటపడ్డ బాగోతం-state government has reportedly found irregularities in the aasara pension scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Aasara Pensions : నిధులు పక్కదారి - 5,650 మందికి డబుల్ పెన్షన్లు.! సెర్ప్ నివేదికతో బయటపడ్డ బాగోతం

TG Govt Aasara Pensions : నిధులు పక్కదారి - 5,650 మందికి డబుల్ పెన్షన్లు.! సెర్ప్ నివేదికతో బయటపడ్డ బాగోతం

HT Telugu Desk HT Telugu

Aasara pension scheme : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్నట్లు సెర్ప్ నివేదికలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు తేలింది.

5650 మందికి డబుల్ పెన్షన్లు (image source from unsplash.com)

గత ఎన్నికల్లో అధికార మార్పిడితో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించడం గమనార్హం.

ప్రభుత్వ సర్వీసులో పని చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పొందుతున్న పెన్షన్ తో పాటు ఆసరా పెన్షన్ సైతం పొందుతున్న విడ్డూరం చోటు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతుండగా ఇందులో 3826 మంది చనిపోయారు. ఇక 1826 మంది ఇప్పటికీ రెండు పెన్షన్లను పొందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం జూన్ నెల నుంచి ఈ పెన్షన్లను నిలిపివేసింది.

ఉమ్మడి ఖమ్మంలో 427 మంది..

ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 427 మందికి అక్రమ పెన్షన్లు అందుతున్నట్లు వెల్లడయ్యింది. వీరందరికీ ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ వృద్ధురాలికి ఒక లక్షా, 72 వేలు తిరిగి ఇవ్వాల్సిందిగా నోటీసు అందింది. అలాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 139 మందికి సర్కారు నుంచి నోటీసులు అందాయి.

నోటీస్ అందిన వారం రోజులలోపు స్పందించి పెన్షన్ రూపంలో పొందిన సొమ్మును తిరిగి చెల్లించకపోతే కేంద్ర, రాష్ట్రాల నుంచి పొందుతున్న సర్వీస్ పెన్షన్ నిలిపివేస్తామని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 200 మందికి నోటీసులు అందాయి.

రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆగస్టు నుంచి ఆసరా పెన్షన్లను 4వేలు, 6 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అక్రమంగా పొందుతున్న పెన్షన్లపై దృష్టి పెట్టింది. ఇలా అక్రమంగా పెన్షన్లు జారీ చేయడంలో కీలక పాత్ర పోషించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.