CM Revanth Reddy: దేశంలోనే ఎస్సీ వర్గీకరణ తెలంగాణలోనే మొదట అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి-revanth reddy announced in the assembly that sc classification will be implemented first in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy: దేశంలోనే ఎస్సీ వర్గీకరణ తెలంగాణలోనే మొదట అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: దేశంలోనే ఎస్సీ వర్గీకరణ తెలంగాణలోనే మొదట అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి

Sarath chandra.B HT Telugu
Aug 01, 2024 12:53 PM IST

CM Revanth Reddy: ఎస్సీ వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణలో వెంటనే వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాదిగ మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేశారని, తాను ప్రతిపక్షంలో ఉండగా మాదిగ మాదిగ ఉపకులాల వర్గాల కోసం వాయిదా తీర్మానం ఇస్తే, తనతో పాటు సంపత్‌ కుమార్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం బహిష్కరించిందని, గత ప్రభుత్వం కేంద్రానికి, ప్రధానికి విజ్ఞప్తి చేయడానికి అఖిలపక్షాన్ని పంపుతామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 3, 2023న మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఢిల్లీకి పంపి, సుప్రీం కోర్టులో బలమైన వాదనల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినిపించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు చెప్పారు.

ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంతో ఏడుగురిలో ఆరుగురు న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, దేశంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ చేస్తుందని ప్రకటించారు. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతివ్వాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం….

ఎస్సి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ను స్వాగతిస్తున్నామని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సిం‍హ ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పుతో అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఇవాళ న్యాయం, ధర్మం గెలిచిందని, తమ ప్రభుత్వం ఎస్సిల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందన్నారు. ఇన్ని ఏళ్ల ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులు అయ్యారని చెప్పారు.

సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ హర్షం…

తెలంగాణ అసెంబ్లీలో సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు హర్షం వ్యక్తం చేశారు.  ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని 29 సెప్టెంబర్ 2014లో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, తీర్మానం ప్రతిని స్వయంగా కేసీఆర్‌ తీసుకెళ్లి ప్రధానిని కలిసి అందచేశారన్నారు. ప్రధాని కూడా దానిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. 

గాంధీ భవన్‌ వద్ద పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తే అప్పటి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని,  కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందర్నీ ఆదుకుందని హరీష్‌ రావు చెప్పారు.  అమరులైన వారిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు. దశాబ్దాల కల నెరవేరిందని, సుప్రీ కోర్టు తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 

సుప్రీం కోర్టు తీర్పును సీపీఐ శాసనసభా పక్ష నేత కూనంనేని స్వాగతించారు. మందకృష్ణతో పాటు ఇతర నాయకులకు అభినందనలు తెలిపారు. 

Whats_app_banner