BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్ కు ముఖ్య నేతలంతా డుమ్మా
BRS RakeshReddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో కొత్త పంచాయితీ మొదలైంది. కారు పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేసినప్పటి నుంచి లుకలుకలు బయటపడ్డాయి.
BRS RakeshReddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో కొత్త పంచాయితీ మొదలైంది. కారు పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేసినప్పటి నుంచి కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేయగా, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన రివ్యూ సందర్భంగా పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలతో కేటీఆర్ రివ్యూ నిర్వహించగా.. మొత్తంగా 150 మంది వరకు ఆహ్వానించారు. కానీ ఆ మీటింగ్ కు 50, 60 మంది మాత్రమే హాజరు కాగా, ఉమ్మడి వరంగల్ కు చెందిన ముఖ్య నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు గైర్హాజరవడం హాట్ టాపిక్ గా మారింది. రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న నేతలంతా డుమ్మా కొట్టగా, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గులాబీ పార్టీలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.
పల్లా స్టాంప్ ఉండటం వల్లే...!
వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి పల్లా అనుచరుడనే ముద్ర ఉంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు రాకేశ్ రెడ్డి బీజేపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగారు. బీజేపీలో ఉన్న సమయంలోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు.
కానీ ఆ పార్టీ అధిష్టానం మహిళా కోటాలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు కేటాయించడంతో రాకేశ్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ ఎదుగుదలకు కష్ట పడి పని చేసినా తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో రాకేశ్ రెడ్డి వెంటనే పార్టీ నుంచి బయటకు వచ్చారు. మొదట్నుంచీ బీఆర్ఎస్ పై మాటల యుద్ధం చేసిన రాకేశ్ రెడ్డి.. బీజేపీ నుంచి బయటకు రావడంతో అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనను బీఆర్ఎస్ గూటికి చేర్చేందుకు శ్రమించారు.
అటు బీఆర్ఎస్ అధిష్టానం.. ఇటు రాకేశ్ రెడ్డితో మంతనాలు జరిపి చివరకు రాకేశ్ రెడ్డిని కారు పార్టీలోకి చేర్చుకున్నారు. అనంతరం అప్పటి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో రాకేశ్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. కాగా రాకేశ్ రెడ్డిని కారు పార్టీకి చేర్చడంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి శ్రమించడం, ఆయన చొరవతోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హామీ రావడంతో రాకేశ్ కు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుడిగా ముద్ర పడింది.
పార్టీలో చేరినప్పటి నుంచి వ్యతిరేకతే
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు. దీంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు పల్లాకు మధ్య విభేదాలు తలెత్తాయి. అంతేగాకుండా రాకేశ్ రెడ్డి బీజేపీలో కొనసాగినన్ని రోజులు దాస్యంపై విపరీతంగా ఫైట్ చేశారు.
దాస్యం కు వ్యతిరేకంగా వివిధ సందర్భంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసి వినయ్ భాస్కర్ ను ఢీ ఫేమ్ చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో వినయ్ భాస్కర్ కు రాకేశ్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకోవడం పెద్దగా నచ్చలేదు. దీంతోనే మొదటి నుంచీ రాకేశ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేగాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేసీఆర్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దీంతో మళ్లీ బీఆర్ఎస్ లోకి అధికారంలోకి వచ్చి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే.. తమ మంత్రి పదవికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర నేతలు కూడా పల్లాను కొంత వ్యతిరేకించారు.
ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ రేసులో వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, కల్లుగీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, ఇతర నేతలు ఆశపడగా.. పల్లా అనుచరుడైన రాకేశ్ రెడ్డికే టికెట్ కేటాయించడాన్ని దయాకర్ రావు కూడా విభేదించారు. కానీ కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వగా.. వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి సహా మిగతా నేతలంతా ఆయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారనే విమర్శలున్నాయి.
ముఖ్య నేతలు డుమ్మా..
క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు బాగోలేని క్రమంలో బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు తదితర నేతలతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.
మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన దాదాపు 150 మంది నేతలకు సమాచారం చేరవేయగా.. అందులో ఉమ్మడి వరంగల్ కు చెందిన ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపెల్లి రవీందర్ రావు ఇతర నేతలు గైర్హాజరు అయ్యారు.
వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ కూడా ఆబ్సెంట్ అయ్యే అవకాశం కనిపించగా.. కేటీఆర్ సర్ది చెప్పి మరీ పిలవడంతో ఆ ఇద్దరు మీటింగ్ లో పాల్గొన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తంగా 50 నుంచి 60 మంది మాత్రమే పాల్గొనగా.. ముఖ్య నేతలు హాజరుకాకపోవడం పట్ల తీవ్ర చర్చ జరిగింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉండగా, ఇప్పుడు కొత్త పంచాయితీ మొదలవడంతో పార్టీలో కొంత అందోళన వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలోనే కేటీఆర్ కూడా అసంతృప్త నేతలతో చర్చలు మొదలుపెట్టినట్టు తెలిసింది. మరి అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని చర్చ జరుగుతోంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం