Telangana : జర్నలిస్టులకు గుడ్ న్యూస్ - ఇళ్ల స్థలాలపై మంత్రి కీలక ప్రకటన, త్వరలోనే పాలసీ-minister ponguleti srinivas reddy key statement about housing for journalists ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana : జర్నలిస్టులకు గుడ్ న్యూస్ - ఇళ్ల స్థలాలపై మంత్రి కీలక ప్రకటన, త్వరలోనే పాలసీ

Telangana : జర్నలిస్టులకు గుడ్ న్యూస్ - ఇళ్ల స్థలాలపై మంత్రి కీలక ప్రకటన, త్వరలోనే పాలసీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 19, 2024 04:29 PM IST

Minister Ponguleti On Journalist Houses : తెలంగాణలోని జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం త్వరలోనే పాలసీని ప్రకటిస్తామని చెప్పారు.

 టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయాహసభలో మంత్రి పొంగులేటి
టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయాహసభలో మంత్రి పొంగులేటి

Minister Ponguleti Srinivas Reddy : జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ఇవాళ ఖమ్మంలో ఏర్పాటు టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకు వస్తామని ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు పదాలతో సమస్యలు తీరుస్తామంటూ హామీలు ఇచ్చారే గాని ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటివరకు వారికి ఇళ్లస్థలాలను ఇవ్వలేదన్నారు.

త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. వారం, పది రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో మిగిలిపోయిన మిగతా జర్నలిస్టులకు, జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుక వస్తున్నామని చెప్పారు.

గడువు 3 నెలలు పొడిగింపు….

గతంలో ఖమ్మంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చిన జీవో ఆగిపోయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. మరొక స్థలాన్ని చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించామని… ఆ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ప్రకటించారు. అక్రిడిటేషన్ల గడువు ఈ నెలాఖరు తో ముగుస్తున్నదని… మరో మూడు మాసాల పాటు గడువు పెంచుతున్నామని దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి వెలువడనున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వం అండగా ఉంటుంది - మంత్రి పొంగులేటి

వందకు వంద శాతం జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. హెల్త్ కార్డులకు సంబంధించి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు.

జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం ఉన్నటువంటి అన్ని రకాల కమిటీలను త్వరలోనే పునరుద్ధ రిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టియుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఐజేయూ ప్రతినిధులు నరేందర్ రెడ్డి, కే సత్యనారాయణ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.

Whats_app_banner