TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్...! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - IMD హెచ్చరికలు జారీ
TS AP Weather Updates : ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
TS AP Weather Updates : గత కొద్దిరోజులుగా భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓవైపు ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోవటంతో ఉదయం 10 దాటిన తర్వాత బయటికి వెళ్లాంలంటే ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఉక్కపోత కూడా క్రమంగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత మూడు రోజులుగా కాస్త ఉపశమనం కలిగించేలా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురవగా… ఏపీలోని ఉత్తర కోస్తాలో తేలిపాకపాటి వానలు పడతున్నాయి. ఇదిలా ఉంటే మరో రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు(Rains in Telugu States) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఏపీలో వర్షాలు…!
దక్షిణ తమిళనాడు నుంచి విదర్బ వరకు గల ద్రోణి ప్రభావంతో ఏర్పడిన గాలులు నిలిచిపోయినట్లు వాతావరణశాఖ తెలిపింది. అయితే కర్ణాటక నుంచి విదర్భ మరియు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఏపీ వరకు గల ద్రోణి బలహీనపడిందని వెల్లడించింది.
వాతావరాణశాఖ బులిటెన్(IMD Weather Report) ప్రకారం.....ఇవాళ ఏపీలోని ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.ఇక దక్షిణ కోస్తాలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేయగా.... సీమ జిల్లాల్లో కూడా ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే అకాశం ఉంది.
తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్….
Rains in Telangana : ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే... ఇవాళ తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే మంగళవారం ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఫలితంగా పంటల నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నేపల్లి, సేవాలాల్ తండా గ్రామాల్లో వడగళ్ల వర్షం కారణంగా వరి పంట దెబ్బతిన్నది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.