Minister Ponnam Prabhakar : ఆగస్టు 15 నుంచి రూ.2 లక్షల పంట రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ- మంత్రి పొన్నం ప్రభాకర్-karimnagar minister ponnam prabhakar started 2 lakh loan waiver to farmers for august 15th onwards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Ponnam Prabhakar : ఆగస్టు 15 నుంచి రూ.2 లక్షల పంట రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ- మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar : ఆగస్టు 15 నుంచి రూ.2 లక్షల పంట రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ- మంత్రి పొన్నం ప్రభాకర్

HT Telugu Desk HT Telugu
Aug 10, 2024 02:58 PM IST

Minister Ponnam Prabhakar : రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీ కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ అధికారులకు రుణాల వివరాలు అందించాలని సూచించారు.

ఆగస్టు 15 నుంచి రూ.2 లక్షల పంట రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ- మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 15 నుంచి రూ.2 లక్షల పంట రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ- మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar : రైతుల రెండు లక్షల రుణమాఫీలో భాగంగా ఈనెల 15 నుంచి పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.‌ ఇప్పటికే 1,50,000 వరకు రుణమాఫీ చేశామని, రుణమాఫీ కాని వారు మండల వ్యవసాయ శాఖ అధికారికి వివరాలు ఇవ్వాలని కోరారు. మెట్ట ప్రాంతానికి వరప్రదాయిని గౌరవెళ్లి ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేసి వచ్చే పంటలోపు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందాలనుకునే వారికి తన కార్యాలయంలో ఉండే వారు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోహెడ మండల కేంద్రంలోని రైతు వేదికతో పాటు అదే మండలంలోని బస్వాపూర్, చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి , మూదిమాణిక్యం క్లస్టర్ లలో సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పెట్టుబడులు తగ్గించి సంప్రదాయ పంటలు కాకుండా అధిక లాభాలు ఆర్జించే పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే రైతులకు లక్ష రూపాయలు , లక్ష 50 వేల వరకు రుణమాఫీ పూర్తి చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి 2 లక్షల రుణమాఫీ ఒకేసారి జరుగుతుందని పేర్కొన్నారు. రుణమాఫీ రాని వారు వ్యవసాయ అధికారులకు వివరాలు ఇవ్వాలనీ, ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్ లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ రాని వారు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆఫీస్ లో వివరాలు ఇవ్వాలన్నారు.

రైతులు సంప్రదాయంగా పండే వరి, మొక్కజొన్న, పత్తి కాకుండా రెట్టింపు ఆదాయం వచ్చే పంటలు వేయాలనీ వ్యవసాయ అనుబంధ రంగాలకు పాడి పరిశ్రమ, పశు సంపద పై దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల పై రైతులకు అవసరమైన అప్లికేషన్లు, లోన్లు తమ కార్యాలయంలో ఉన్న వారు సహకరిస్తారన్నారు. మహిళలకు స్త్రీ శక్తి పథకాలను ఉపయోగించుకొని మహిళా సాధికారత ఆర్థికవృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి హామీలో పంట పొలాల చదును, రోడ్లు వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.

సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి

వ్యవసాయం అనగానే వరి, మొక్కజొన్న, పత్తి పంటలు కాకుండా అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని సూచించారు. అందులో భాగంగా ఆయిల్ ఫామ్ సాగు, డ్రాగన్ ఫ్రూట్ పంట, కూరగాయలు, మామిడి , దానిమ్మ , నిమ్మ, బత్తాయి , జామ, కొబ్బరి, అరటి పంటల సాగు చేయవచ్చన్నారు. ఈ పండ్ల తోటల కోసం 40 శాతం సబ్సిడీ ఉంటుందని డ్రిప్ ఇరిగేషన్ లో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఉండగా బీసీలకు 90 శాతం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంటల కోసం ఎకరాకు ప్రతి సంవత్సరానికి రూ.4500 ప్రభుత్వం అందిస్తుందని..ఈసాగు వల్ల మూడున్నర సంవత్సరాల పంట దిగుబడి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ప్రతి ఎకరాకు 57 మొక్కలు అవసరమవుతాయని పూర్తిగా ప్రభుత్వమే మొక్కలు పంపిణీ చేస్తుందని తెలిపారు.

ఇందులో అంతర పంటల సాగు కూడా చేయవచ్చని దీనికి చీడ పీడలు ఉండవని ,కోతుల బెడద ఉండదని అధికారులు వివరించారు. డ్రాగన్ ఫ్రూట్ పంటకి ఎకరాకు రూ.64 వేల సబ్సిడీ ఉంటుందని అధికారులు తెలిపారు. దీని వల్ల పంట రావడం ప్రారంభం అయితే అధిక ఆదాయం సాధించవచ్చన్నారు. మల్బరీకి ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తుందని తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు అర్జించవచ్చని అధికారులు తెలిపారు. ఒకసారి పంట రావడం ప్రారంభమైతే సంవత్సరానికి 7 పంటలు వస్తాయని ఇప్పటికే పంట సాగు చేస్తున్న రైతులు తెలిపారు. దీనికి కోతులు, అడవి పందుల బెడద ఉండదన్నారు.

డెయిరీలో పీఎంఈజీపీ కింద 20 లక్షల వరకు లోన్

డెయిరీ లో PMEGP కింద లక్ష రూపాయల నుంచి మొదలు 20 లక్షల వరకు యూనిట్స్ ఉంటాయని ఇందులో గేదెలు, ఆవులు ఉంటాయని రైతులకు 35 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. కోళ్లల్లో లేయర్లు , బాయిలర్లు ఏదైనా పెట్టుకోవచ్చన్నారు. దీనికి కూడా సబ్సిడీ వర్తిస్తుందన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా 500 గొర్రెలు , 25 పొట్టేల్లు ఒక యూనిట్ గా కోటి రూపాయల వరకు ఉన్న దీనిలో 50 లక్షల వరకు సబ్సిడీ రాగా మిగిలిన దానిని బ్యాంకుల నుంచి లోన్ , కొంత మేర రైతు నుంచి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ విభాగంలో పందుల పెంపకం కూడా ముఖ్యమైనదని 60 లక్షలు ఉన్న యూనిట్ లో 30 లక్షల వరకు సబ్సిడీ ఉండగా మిగిలిన దానిలో బ్యాంక్ లోన్, రైతు కొంత మేర చెల్లించాల్సి ఉంటుంది. పశువుల పాక కోసం 100 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని సొసైటీ ల కింద ఉన్న చెరువుల్లో 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలు వేస్తుందని తెలిపారు. సొసైటీ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందన్నారు. చేపల చెరువుల కోసం రెండున్నర ఎకరాల భూమి ఉంటే ప్రభుత్వం ఏడున్నర లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల భూములు లేవలింగ్ , బోర్లు ఎండిపోకుండా ఫామ్ పాండ్స్ నిర్మించుకోవచ్చన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మలేరియా , డెంగ్యూ కేసులు రాకుండా నిల్వ నీరు లేకుండా చూడడం తో పాటు ఫీవర్ సర్వే లాంటివి చేస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల కోసం లబ్దిదారుల కోసం ఇప్పటి వరకు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం