Karimnagar Accident: కరీంనగర్‌లో ఘోర ప్రమాదం, బస్సు-లారీ ఢీ.. డ్రైవర్ మృతి, 14మందికి తీవ్ర గాయాలు
Karimnagar Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామడుగు మండలం కొండన్నపల్లి వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు.

Karimnagar Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామడుగు మండలం కొండన్నపల్లి వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు లారీ డ్రైవర్ బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్ తో సహా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆక్సిడెంట్ అయిన బస్సును వెనుక నుంచి టాటా యస్ వాహనం ఢీ కొట్టడంతో టాటా ఎస్ వాహనం డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పెగడపల్లి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును జగిత్యాల వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
క్యాబిన్ లో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్ లు
లారీ రాంగ్ రూట్ పల్లె వెలుగు బస్సును ఢీ కొట్టడంతో లారీ ముందు బాగం నుజ్జునుజ్జు అయింది. లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అటు ప్రమాదానికి గురైన బస్సు వెనుకాలే వస్తున్న టాటా యస్ వాహనం బస్సును వేగంగా ఢీ కొట్టడంతో టాటా యస్ వాహనం ముందు బాగం నుజ్జునుజ్జు అయి డ్రైవర్ అందులో ఇరుక్కుపోగా అతికష్టం మీద స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో క్షతగాత్రులు కోలుకుంటున్నారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
తృటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే కారణమని క్షతగాతులు ఆరోపించారు. అతివేగంగా రాంగ్ రూట్ లో వచ్చి బస్సు ను ఢీ కొట్టాడని బస్సు డ్రైవర్ రాజు, కండక్టర్ రాహుల్ తోపాటు గాయపడ్డ ప్రయాణీకులు తెలిపారు. గాయపడ్డ ప్రయాణికులకు టిఎస్ ఆర్ టి సి ఆద్వర్యంలో వైద్యం అందించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగ వారికి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)