Bandi Sanjay Rythu Deeksha : రైతు జంగ్ సైరన్ మోగించిన బండి సంజయ్, ఏప్రిల్ 2న రైతు దీక్ష-karimnagar bjp mp bandi sanjay announced rythu deeksha support farmers issues ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay Rythu Deeksha : రైతు జంగ్ సైరన్ మోగించిన బండి సంజయ్, ఏప్రిల్ 2న రైతు దీక్ష

Bandi Sanjay Rythu Deeksha : రైతు జంగ్ సైరన్ మోగించిన బండి సంజయ్, ఏప్రిల్ 2న రైతు దీక్ష

HT Telugu Desk HT Telugu
Mar 31, 2024 09:18 PM IST

Bandi Sanjay Rythu Deeksha : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. రైతుల కోసం జంగ్ సైరన్ మోగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 2 నుంచి రైతు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.

బండి సంజయ్
బండి సంజయ్

Bandi Sanjay Rythu Deeksha : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Protest) రైతుల కోసం జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యం వల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం… పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీనీ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపిస్తూ ‘రైతు దీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఏప్రిల్ 1న కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 2న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ తోపాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బండి బస

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల అమలుతో పాటు యుద్ద ప్రాతిపదికన పరిహారం అందజేయాలని, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో బండి సంజయ్ ఉద్యమ సైరన్(Bandi Sanjay Jung Siren) ను మోగించారు. దీంతోపాటు ఏప్రిల్ తొలి వారం నుంచి వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేయించడంతోపాటు తాలు, తప్ప, తేమ పేరుతో తరుగు లేకుండా ధాన్యం(paddy procurement) పూర్తిస్థాయిలో కొనుగోలు చేయించడమే లక్ష్యంగా బండి సంజయ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తప్ప, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్ల కల్లాల దగ్గర బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నారు. దీంతోపాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు.

రాజకీయాలకతీతంగా రైతుల కోసం పోరాడుదాం

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే 'రైతు దీక్ష'(Rythu Deeksha)కు అన్ని వర్గాలు మద్దతివ్వాలని బండి సంజయ్ (Bandi Sanjay)కోరారు. రాష్టానికి అన్నం పెట్టే రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాజకీయాలను, సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ముఖ్యంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు రైతు క్షేమం కాంక్షించే ప్రతి ఒక్కరూ రైతు దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. రైతులతోపాటు మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు కోసం సైతం అతి త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఈ మేరకు 2, 3 రోజుల్లో యాక్షన్ ప్లాన్ ను రూపొందించి వెల్లడిస్తామని పేర్కొన్నారు.

బీజేపీ ప్రధాన డిమాండ్ లు(BJP Demands)

  • పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం(Farmers Compensation) చెల్లించాలి.
  • తక్షణమే వడ్ల కొనుగోలు(Paddy Procurements) కేంద్రాలను ప్రారంభించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్(Bonus) ప్రకటించాలి. ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలి.
  • తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి.
  • రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని(MGNREGA) వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలి.
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ ను ఏర్పాటు చేయాలి.
  • సమగ్ర పంటల బీమాన అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలి.
  • కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలి.

HT Correspondent K.Vijender Reddy Karimnagar

సంబంధిత కథనం