Bandi Sanjay Letter : సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి - సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ-bjp mp bandi sanjay open letter to cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Mp Bandi Sanjay Open Letter To Cm Revanth Reddy

Bandi Sanjay Letter : సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి - సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 07:52 PM IST

BJP Bandi Sanjay Letter to CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని కోరారు.

బండి సంజయ్ లేఖ
బండి సంజయ్ లేఖ

BJP MP Bandi Sanjay Kumar : సిరిసిల్ల నేత కార్మికుల సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(BJP Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. నేత కార్మికులకు రావాల్సిన రూ.270 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని, 'వర్కర్ టు ఓనర్’ పథకం అమలు చేయాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

వస్త్ర సంక్షోభంతో సమ్మె లో కార్మిక లోకం..

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న దాదాపు 20 వేల మంది పవర్ లూమ్ అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారు. అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో బాధతో లేఖ రాస్తున్నట్లు బండి సంజయ్(Bandi Sanjay Letter) లేఖలో పేర్కొన్నారు.

బతుకమ్మ చీరల బకాయి 270 కోట్లు

గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములను, యజమానులపై ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బంద్ చేయించింది. ఆ తరువాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చింది. బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక, కొత్త ఆర్డర్లు లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారు. ఫలితంగా పరిశ్రమతోపాటు అనుబంధంగా ఉన్న వార్పిన్, సైజింగ్, డైయింగ్ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత 27 రోజులుగా ఆసాములు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి డిమాండ్లు న్యాయమైనవే. వెంటనే ప్రభుత్వం స్పందించి సమ్మె విరమింపజేయడంతో పాటు ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలి..

పవర్ లూం కార్ఖానాలకు గత 24 సంవత్సరాల నుండి 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్ ను నిలిపివేయడంతో రెట్టింపు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఆసాములు ఆ బిల్లులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. తక్షణమే విద్యుత్ బకాయిలను మాఫీ చేయడంతోపాటు విద్యుత్ సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని బండి సంజయ్ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలని, నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించడంతోపాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి అధిగమించేలా అన్ని చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

రిపోర్టింగ్ - కరీంనగర్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు

WhatsApp channel