IT ED Raids MLC Kavitha : లిక్కర్ కేసులో కీలక పరిణామం..! ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు..!
ED IT Raids at BRS MLC Kavitha House: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ తనిఖీల్లో ఐటీ అధికారులు కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.
IT Raids at BRS MLC Kavitha House: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha) నివాసంలో ఈడీ(ED) అధికారులు సోదాలు చేపట్టారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం… కవిత ఇంట్లో తనిఖీలు చేపట్టింది. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు చేస్తుండగా.. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
ఈడీ అధికారులతో పాటు ఐటీ(Income Tax) అధికారులు కూడా ఈ తనిఖీల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. కవితతో పాటు ఆమె భర్త వ్యాపార వ్యవహారలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam ) కేసులో భాగంగా కవిత నివాసంలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి గతేడాది నుంచి కవితపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సౌత్ గ్రూపునకు సంబంధించి కీలక విషయాల్లో కవిత ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా పలుమార్లు సీబీఐ, ఈడీ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు కవిత. రెండు సార్లు సీబీఐ అధికారులు... హైదరాబాద్ కవిత నివాసంలో విచారణ కూడా జరిపారు. ఇదే క్రమంలో గతేడాది మార్చిలో ఢిల్లీలోని ఈడీ(Enforcement Directorate) ఆఫీస్ లో జరిగిన విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఆ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ కవిత అరెస్ట్ కాలేదు. లిక్కర్ కేసులో తన పేరును ప్రస్తావించటంతో పాటు మహిళలను విచారించే పద్ధతిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. తుది తీర్పు వచ్చే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు తీర్పునిచ్చింది.
కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ…. ఆ తర్వాత కూడా సీబీఐ(CBI) అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతకుముందు కవిత పేరు కేవలం సాక్షిగా మాత్రమే ఉండగా… ఇటీవలే నిందితురాలిగా పేర్కొంది సీబీఐ. విచారణకు హాజరుకావాలని కూడా సమన్లను జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకాలేనని కవిత బదులిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా క్యాంపెయినింగ్ బాధ్యతలు ఉన్నాయని… ఈ కారణాల రీత్యా హాజరుకాలేనని రిప్లే ఇచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందనున్న కవిత విచారణకు హాజరుకాలేదని వార్తలు వచ్చాయి. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. మార్చి 19వ తేదీకి విచారణకు వాయిదా వేసింది.
ఈ కేసులో తీర్పును బట్టి ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi excise policy irregularities) కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న మాగుంట రాఘవ, ఆరుణ్ పిళ్లైతో పాటు కవిత పీఏ అశోక్ అఫ్రూవర్లుగా మారటంతో దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసులో దూకుడు పెంచినట్లు సమాచారం.