Opinion: కాంగ్రెస్‌ గ్రాఫ్‌ ఇక... పైకా? కిందికా? క్షేత్రస్థాయి అధ్యయనం చెబుతున్నదిదే-is congress graph on the rise or decline a political analysis by peoples pulse dileep reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Opinion: కాంగ్రెస్‌ గ్రాఫ్‌ ఇక... పైకా? కిందికా? క్షేత్రస్థాయి అధ్యయనం చెబుతున్నదిదే

Opinion: కాంగ్రెస్‌ గ్రాఫ్‌ ఇక... పైకా? కిందికా? క్షేత్రస్థాయి అధ్యయనం చెబుతున్నదిదే

HT Telugu Desk HT Telugu
Jul 08, 2024 05:08 PM IST

Opinion: తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతోందా? పెరుగుతోందా? ఇకపై ఎలా ఉండనుంది? క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి దిలీప్ రెడ్డి విశ్లేషణ.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (HT_PRINT)

తెలంగాణ ప్రజాక్షేత్రం గుంబనంగా ఉన్నా సుస్పష్టంగానే ఉంది. ఆరు మాసాల కింద ప్రజలిచ్చిన తీర్పు భారీ మార్పుతో పాత ప్రభుత్వం పోయి, కొత్త ప్రభుత్వం కొలువుతీరినా... ఆశించిన వేగంతో మార్పు రావటం లేదనే భావన జనంలో నెమ్మదిగా బలపడుతోంది.

‘ఇప్పుడిప్పుడే కద! చూద్దాం ముందెలా ఉంటుందో?’ అన్న టైమ్‌ రెమిషన్‌ కూడా ఇప్పటికైతే ప్రజలు పాలకపక్షానికి ఇస్తున్నారు. ఈ భావనే పార్టీకి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలనిచ్చింది. నిరుద్యోగం, వ్యవసాయం (రైతుబంధుారుణమాఫీ), పెన్షన్ల పెంపు, రేషన్‌ కార్డుల జారీ, ఇళ్ల నిర్మాణం... వంటి విషయాల్లో ఆశించిన వేగంతో మార్పు రావట్లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి అక్కడక్కడ పొడసూపుతోంది.

లోడ్‌ షెడ్డింగ్‌ అని ‘సర్కారువారు’ ఎన్ని చెబుతున్నా, క్షేత్రంలో కరెంట్‌ కోతల కటకట ప్రజలు పసిగట్టే స్థాయిలోనే ఉంది. హామీల వల్ల ధరణి విషయంలో జనమింకా ఆశావహంగా ఉన్నారు. ఫిర్యాదులు అపరిష్కృతంగానే ఉండటంతో ఆచరణలో వారికింకా పూర్తితృప్తి లభించడం లేదు. కొత్త ప్రభుత్వమన్న బెరుకేమీ లేకుండా అన్ని స్థాయిల్లో ‘కాంగ్రెస్‌ తరహా’ అవినీతి మొదలైందని, అది వికేంద్రీకృతమౌతోందనే భావన ప్రజల్లో వచ్చింది.

అధికారుల పాలనలానే సాగుతోంది తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మార్క్‌ గానీ, అసలు కాంగ్రెస్‌ మార్క్‌ గానీ ఇంకా రాలేదంటున్నారు. రాబోయే నాలుగున్నరేళ్ల కోసం కాంగ్రెస్‌ సర్కారు గ్రాఫ్‌... పైకా? కిందికా..? అన్నది ఇక్కడ్నుంచే మొదలవచ్చు, అదిప్పుడు ‘బాయిలింగ్‌ పాయింట్‌’ వద్ద ఉంది. ఆరు మాసాల గడువు, సార్వత్రిక ఎన్నికలూ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌... అన్నీ ముగిసాయి కాబట్టి, సానుకూలతైనా, వ్యతిరేకతైనా వేగం పుంజుకునేది ఇప్పట్నుంచే అని తాజా పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది.

పాలనాపార్టీ... జోడెడ్ల బండి

పార్టీగా కాంగ్రెస్‌ను ఎలా నడుపుతారనే విషయమై సొంత శ్రేణుల్లోనూ సందేహాలున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నపుడు తలెత్తే సమస్య ఇది. అటు పాలనకు, ఇటు పార్టీకి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి తప్పించి పార్టీ పగ్గాలు మరో నేతకు అప్పగించే కసరత్తు ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది.

ఎన్నికైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయానికి ప్రజలు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు లేదు. ఈ చర్యలకు వారి ఆమోదం ఉందనుకోవడానికీ లేదు. ‘ఇది అవసరమా?’ అని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ చేసిన తప్పే, కాంగ్రెస్‌ కూడా చేస్తే... ఇద్దరికీ తేడా ఏముంటుంది, ప్రజాతీర్పుకు విలువేముంది? అన్నది వారి ప్రశ్న. దాని వల్ల అదనపు ప్రయోజనం కూడా ఏమీ లేదని, కిందటి సారి ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌ చంకన చేరి, కడకు అయిదుగురే మిగిలినా.... ప్రజలు స్పష్టమైన మెజారిటీతోనే కాంగ్రెస్‌ను గెలిపించుకోవడాన్ని వారుదహరిస్తున్నారు.

‘వలసల’ని ప్రోత్సహించడం ద్వారా నాటి బీఆర్‌ఎస్‌ పొందిన అదనపు ప్రయోజనం ఏమీ లేకపోగా కడకు ప్రజాగ్రహానికి గురికావాల్సి వచ్చిన సందర్భాన్ని వారు గుర్తుచేస్తున్నారు. జగిత్యాల పాలకపక్ష ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడం కొంత దుమారమే లేపింది.

ఇది తప్పని, ఇదే నియోజకవర్గానికి పలు దఫాలు ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు టి.జీవన్‌రెడ్డి ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆయన సిద్దపడిపోతున్నారు. తనను కనీసం సంప్రదించకుండా జరిపిన ఈ దుందుడుకు చర్యను తానైనా, పార్టీ కార్యకర్తలైనా జీర్ణించుకోలేకపోతున్నారనేది ఆయన వాదన. అధినాయకత్వం ఢిల్లీ పిలిపించి నచ్చజెప్పినప్పటికీ ఆయన వినేలా లేరని తెలుస్తోంది. పార్టీ తరపున పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2019 లో గెలిచిన జీవన్‌రెడ్డి, ప్రస్తుతం శాసనమండలిలో ఉన్నారు.

జాతకాల వేటలో పార్టీలు

కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరుమాసాలు పూర్తయిన సందర్భంలో ‘పీపుల్స్‌ పల్స్‌’ రీసెర్చ్‌ సంస్థ క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. రాజకీయ పార్టీల అంచనాలకు, వాస్తవాలకు కొంత స్వామ్యం ఉన్నా... పలు విషయాల్లో వ్యత్యాసమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్వీయ బలం గురించిన బీజేపీ సొంత అంచనాలకు, క్షేత్రంలోని వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది.

వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పదిహేనేళ్ల వరుస పాలన తర్వాత బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం జాతీయ స్థాయిలో గట్టి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంటుందనేది కాంగ్రెస్‌ వర్గాల ఆశగా ఉంది. ‘ఇండియా’ కూటమి తరపున రాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్‌ అయి ఉంటారని, ఈ అయిదేళ్లు ఇక్కడ సర్కారును కాస్త జాగ్రత్తగా నడుపుకుంటే, కనీసం మరొక్క టర్మ్‌ అయినా తెలంగాణలో భవిష్యత్తు కాంగ్రెస్‌దే అనే భావన పార్టీ వర్గాల్లోనే కాక వారి సానుభూతిపరుల్లోనూ వ్యక్తమౌతోంది.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీల’ మేర హామీల అమలును, పరిపాలనా తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ ఆశిస్తున్నట్టు, ప్రత్యర్థి భయపడుతున్నట్టు... ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా కొట్టుకొని పోలేదు. జనాదరణ కోల్పోయి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయినా.... ప్రజాక్షేత్రంలో ఇంకా బలమైన శక్తిగానే బీఆర్‌ఎస్‌ కనబడుతోంది.

ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు వివిధ స్థాయి ఇతర నాయకులను ఎంత మేర నిలబెట్టుకోగలుగుతుంది? పార్టీ శ్రేణులకు నాయకత్వం ఏ మేర ధీమా ఇవ్వగలుగుతుంది అన్నదే ప్రశ్న. ‘వలస’ పరిణామాలతో నిమిత్తం లేకుండా సంస్థాగతంగా, ప్రజా ఉద్యమాల పరంగా పార్టీ కార్యకర్తల్ని క్రియాశీలంగా ఉంచడం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అవకాశంగా మలచుకోవడం పైనే బీఆర్‌ఎస్‌ ‘పునర్వైభవం’ పొందడం ఆధారపడి ఉంటుంది.

‘వీళ్లు కాకపోతే... మళ్లీ వాళ్లే’ అనే జనవాక్యాన్ని బట్టి బీఆర్‌ఎస్‌ ఇంకా ప్రజల మదిలో ఉందనే తెలుస్తోంది. విపక్షంగా బీఆర్‌ఎస్‌ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ, ప్రజాపక్షంవహిస్తే దానికి మనుగడ, ప్రత్యామ్నాయంగా నిలిచే సత్తా ఉంటుందనేది జనంలో వ్యక్తమౌతున్న సగటు భావన. ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నాయకులు పార్టీని వీడి పాలకపక్షంలోకి పోయినా.... బీఆర్‌ఎస్‌ బలపడటానికి ఆస్కారం ఉందన్నది వారి అభిప్రాయం.

పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులతో భేటీ సందర్భంగా వారి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు కూడా ఇదే చెబుతున్నారు. ‘జనం అవసరాలు, కార్యకర్తల బలం ఆధారంగా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం’ అంటున్నారాయన. తెలంగాణ అస్తిత్వంతో ముడివడి ఉన్న పార్టీ అయినందున, జరిగిన తప్పులకు క్షమాపణ కోరి, సరిదిద్దుకొని చిత్తశుద్దితో ప్రజా ఉద్యమాలు నడిపితే తిరిగి అధికారంలోకి రాగల అవకాశం బీఆర్‌ఎస్‌కు ఉంటుంది. ఇందుకు అవసరమైన కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల వ్యవస్థ ఇంకా పటిష్టంగానే ఉందని ప్రజాక్షేత్రం చెబుతోంది.

నీడ నుండి నిజంలోకి రావాలి

తెలంగాణలో బీజేపీ బలపడుతున్నట్టే కనిపిస్తున్నా... సంస్థాగత కోణంలో బలహీనంగా ఉంది. రాష్ట్రం వరకు బీఆర్‌ఎస్‌ను నెట్టేసి, పాలకపక్షానికి ప్రత్యామ్నాయం కాగల స్థాయి ఇప్పటికైతే బీజేపీకి రాలేదన్నది జనవాణి. సంస్థాగతంగా బలపడటానికి సత్వర చర్యలు చేపట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక సందర్భంగా మలచుకుంటే, నిజమైన బలాన్ని నిరూపించుకునే అవకాశం బీజేపీకి లభిస్తుంది. అదే ఊపుతో ముందుకు సాగితే... కింద కార్యకర్తల దన్ను, పైనుంచి ఢిల్లీ పెద్దల సహకారం తోడై తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగగలుగుతుంది.

అంతే తప్ప, ‘పార్లమెంటులో 8 స్థానాలు గెలిచాం కాబట్టి, ఇక రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం’ అనుకుంటే, కిందటిసారి ఎదురైన భంగపాటే... మున్ముందూ తప్పకపోవచ్చు. 2019 లో గెలిచిన నాలుగు పార్లమెంటు స్థానాల పరిధిలో, వెంటనే జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో నాలుగు జడ్పీటీసీలు కూడా గెలువలేనప్పుడు అది ‘మోదీ’ పేరుతో వచ్చిన పాల నురగ తప్ప బలమెలా అవుతుంది. ఏ సారి ఆ నురగ మరింతగా ఉంది. పోనీ, ఈ సారి గెలిచిన 8 లోక్‌సభ స్థానాల పరిధిలో 8 జడ్పీటీసీలో, 8 మున్సిపాలిటీలో కైవసం చేసుకోగల వ్యవస్థ బీజేపీకి ఉండాలిగా?

భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌-బీజేపీ కలిసి పనిచేస్తాయనే ప్రచారం ఉన్నా, ఆ ఆలోచన జనంలో లేదు. రకరకాల రాజకీయ కథనాలు, వదంతులు మాత్రం వ్యాప్తిలో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ గత చరిత్రను బట్టి సగటు ప్రజలు ఆ దిశలో ఊహ గానీ, ఆలోచన గానీ చేస్తున్నట్టు లేదు. కలిసినా... పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చనే ఒక అభిప్రాయం అక్కడక్కడ ఉంది. కానీ, అదే ప్రామిణికం కాదు. రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు కనుక పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేస్తే, తెలంగాణలో భవిష్యత్తు ఉండవచ్చన్నది ఒక స్థూలాభిప్రాయం. ఆయా రాజకీయ పార్టీలకు, ఇప్పటికైతే.... తెలంగాణ వివిధ సామాజిక వర్గాల్లో మిశ్రమ సానుకూలత ఉంది. ఎదిగే అవకాశాలు కూడా, దున్నుకున్నోళ్లకు దున్నుకున్నంత!

--దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ ఎనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ సర్వే సంస్థ

దిలీప్ రెడ్డి
దిలీప్ రెడ్డి

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, వ్యూహాలు, అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు రచయిత వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)

WhatsApp channel