BRS MLCs In Congress: బీఆర్‌ఎస్‌కు షాక్, అర్థరాత్రి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు-big shock to brs six mlcs joined congress late at night ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mlcs In Congress: బీఆర్‌ఎస్‌కు షాక్, అర్థరాత్రి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

BRS MLCs In Congress: బీఆర్‌ఎస్‌కు షాక్, అర్థరాత్రి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

Sarath chandra.B HT Telugu
Jul 05, 2024 05:51 AM IST

BRS MLCs In Congress: బీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు

BRS MLCs In Congress: బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో వారు గురువారం అర్థరాత్రి కాంగ్రెస్‌ పార్టీతీర్థం పుచ్చుకున్నారు.

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కండువాకప్పి ఎమ్మెల్సీలను సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించారు.

గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి ఆలస్యంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన రావాల్సిన విమానం ఆలస్యమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆరుగురు ఎమ్మెల్సీలు రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. దీపాదాస్ మున్షీ సమక్షంలో సీఎం వారికి కాంగ్రెస్ కండువా కప్పారు.

తెలంగాణ శాసన మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ఆరుగురు మాత్రమే సభ్యులు న్నారు. తాజాగా ఆరుగురు సభ్యులు చేరడంతో వారి బలం 12కు చేరింది. వామపక్ష ఎమ్మెల్సీ మద్దతుతో కలిపితే 13కు చేరుతుంది. కాంగ్రెస్ పార్టీకి మరో ఐదారు సీట్లు ఉంటే మండలిలో కూడా మెజారిటీ దక్కుతుంది. ప్రస్తుతం తెలంగాణ మండలిలో బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. కీలక బిల్లులను నెగ్గించుకునే రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే వీలుంటుంది.

అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఎమ్మెల్సీల పార్టీ మార్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొద్ది రోజులుగా బస్వరాజు సారయ్య పేరు వినిపిస్తున్నా స్పష్టత రాలేదు. అనూహ్యంగా ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారడం కలకలం రేపింది.

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్లో సమావేశ మైన ఎమ్మెల్సీలు 11.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి చేరు కున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. ఆ సమయంలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే పార్టీలో చేరికల కార్యక్రమం పూర్తి చేశారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలయ్యాక పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. బీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరిన వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య ఉన్నారు. గుత్తా కుమారుడు అమిత్ కూడా కాంగ్రెస్‌లో చేరాడు. తాజా పరిణామాలతో బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టైంది.

Whats_app_banner