Jagtial Congress Fight : ఢిల్లీకి చేరిన 'జగిత్యాల' కాంగ్రెస్‌ పంచాయితీ - జీవన్ రెడ్డి నిర్ణయమేంటి..?-congress mlc t jeevan reddy went to new delhi over brs mla m sanjay joining issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Congress Fight : ఢిల్లీకి చేరిన 'జగిత్యాల' కాంగ్రెస్‌ పంచాయితీ - జీవన్ రెడ్డి నిర్ణయమేంటి..?

Jagtial Congress Fight : ఢిల్లీకి చేరిన 'జగిత్యాల' కాంగ్రెస్‌ పంచాయితీ - జీవన్ రెడ్డి నిర్ణయమేంటి..?

HT Telugu Desk HT Telugu
Jun 26, 2024 05:31 PM IST

MLC Jeevan Reddy : జగిత్యాల కాంగ్రెస్ పంచాయితీ హస్తినకు చేరింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకే మొగ్గు చూపుతున్న జీవన్ రెడ్డిని పార్టీ పెద్దల నుంచి పిలుపు అందింది. దీంతో హస్తనికు వెళ్లిన జీవన్ రెడ్డి… అగ్రనేతలతో మాట్లాడనున్నారు.

ఢిల్లీకి జీవన్ రెడ్డి....!
ఢిల్లీకి జీవన్ రెడ్డి....!

MLC Jeevan Reddy : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గుట్టు చప్పుడు కాకుండా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సమస్య డిల్లీకి చేరింది. కనీస సమాచారం లేకుండా ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రెండు రోజులుగా రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పిలిచారు.

ఢిల్లీకి వెళ్లిన జీవన్ రెడ్డి పార్టీ పెద్దలతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం కాక ఆయనను సముదాయించి గౌరవప్రదమైన పదవి ఇచ్చే పనిలో అధిష్టానం నిమగ్నమైనట్లు తెలుస్తుంది. కుదిరితే మంత్రి పదవి, లేదంటే పార్టీ పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక అంశం చివరకు అధిష్టానం పెద్దలు వద్దకు చేరింది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరిక గురించి అధిష్టానం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఢిల్లీకి పయనం అయ్యారు.

వెనువెంటనే జీవన్ రెడ్డిని సైతం ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడంతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడంతో జీవన్ రెడ్డి అలకబూనిన విషయంతో పాటు త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.

జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్ లో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన డిప్యూటీ సీఎం భట్టీ, మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో చర్చించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కాదన్న వాదనలు వినిపించినట్టుగా సమాచారం.

తెలంగాణ ఇంఛార్జీ దీప్ దాష్ మున్షి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ లు కూడా ఫోన్లో మాట్లాడినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం శాంతించనట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డితో ఒకటి రెండు సార్లు ఫోన్లో సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి అధిష్టానం ముఖ్య నేతల ముందు ఉంచిన విషయాలకు క్లారిటీ ఇవ్వాలని కూడా అంటున్నట్టుగా సమాచారం.

పార్టీకి విదేయుడిగా…

1985లో టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఏనాడూ క్రమశిక్షణ ఉల్లంఘించలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ లోకసభ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేశారు.

ప్రతికూల వాతావరణంలో అధిష్టానం చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని జీవన్ రెడ్డి అంటున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను పార్టీలో కొనసాగానే తప్ప ఇతర పార్టీల వైపు చూడలేదని తెలిపారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తా పార్టీ మారాలని ప్రతిపాదన చేసినా తాను ససేమిరా అన్నానని, ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ప్రపోజల్ వచ్చినా తాను తిరస్కరించానే తప్ప పార్టీ మారలేదన్న విషయాన్ని గమనించాలని జీవన్ రెడ్డి పార్టీ శ్రేణుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు.

పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా కట్టుబడి ఉన్న తనను సంప్రదించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కారణం ఏంటో వివరించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. సంఖ్యాబలం ఉన్నప్పుడు ఇతర పార్టీల వారిని ఫిరాయించే సంస్కృతి సరి కాదని, పాంచ్ న్యాయ్ లో ఒకటిగా ఉన్న ఫిరాయింపు వ్యవహారాన్ని ఎలా అతిక్రమించారో చెప్పాలని అంటున్నట్టుగా తెలిసింది.

గంటల కొద్ది చర్చలు జరిపినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పడంతో తమకు ఐదు రోజుల పాటు సమయం ఇవ్వాలని భట్టి విక్రమార్క అడగగా రెండు రోజులు మాత్రమే ఆగుతానని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి మాత్రం తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గడం లేదని సమాచారం.

బుధవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే గుత్తా మాత్రం అందుబాటులో లేనని చెప్తుండడంతో మండలి కార్యదర్శికి రాజీనామా లేఖ ఇవ్వాలని కూడా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మండలి సెక్రటరీ రాజీనామా లేఖ తీసుకునేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.

శ్రేణులతో సమాలోచనలు…

మరో వైపున జీవన్ రెడ్డి తన అనుచరులు, అభిమానులతో మంగళవారం రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా అమలు చేయాలి అన్న విషయంపై పది మంది చొప్పున బృందాలుగా చేసి వారితో చర్చలు జరిపినట్టు సమాచారం.

జగిత్యాలకు చెందిన పార్టీ శ్రేణులు, జీవన్ రెడ్డి అభిమానులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతం పార్టీలోకి చేరుతున్న ఎమ్మెల్యేల అంశం గురించి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తరువాత తుది నిర్ణయం వేలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏఐసీసీ ముఖ్య నేతలు ఇచ్చే సమాధానంతో జీవన్ రెడ్డి తన నిర్ణయంపై పునరాలోచన చేస్తారా లేక... రాజీనామా చేస్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మండలి ఛైర్మన్ అపాయింట్ మెంట్ కోసం ఇంకా ట్రై చేస్తున్నందున ఏఐసీసీ నేతలు జీవన్ రెడ్డి అంశాన్ని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుని చర్చించనున్నట్లు తెలుస్తుంది..

రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం