September 17th : ఆపరేషన్ పోలో ఎన్ని రోజులు జరిగింది? హైదరాబాద్ సైన్యం ఏమైంది?-interesting facts about operation polo in september 1948 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  September 17th : ఆపరేషన్ పోలో ఎన్ని రోజులు జరిగింది? హైదరాబాద్ సైన్యం ఏమైంది?

September 17th : ఆపరేషన్ పోలో ఎన్ని రోజులు జరిగింది? హైదరాబాద్ సైన్యం ఏమైంది?

Basani Shiva Kumar HT Telugu
Sep 14, 2024 05:50 AM IST

September 17th : ఆపరేషన్ పోలో.. ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్ స్టేట్. ఎందుకంటే.. దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్ స్టేట్ ప్రజలకు మాత్రం రాలేదు. ఇంకా నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు మగ్గిపోయారు. వారికి విముక్తి కల్పించడానికి జరిపిందే ఆపరేషన్ పోలో.

 ఆపరేషన్ పోలో
ఆపరేషన్ పోలో (HT)

భారతదేశానికి 1947లో బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కలిగింది. కానీ.. దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ స్టేట్ ప్రజలు మాత్రం స్వేచ్ఛా వాయువులు పీల్చలేదు. అప్పటివరకు పాలించిన నిజాం రాజుల పాలనలో మగ్గిపోయారు. ఎన్నో చర్చలు.. ఒప్పందాలు జరిగాయి. అయినా నిజాం పాలకుల తీరు మారలేదు. దీంతో అప్పటి హైదరాబాద్ స్టేట్ ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఫలితంగా నిజాం అణచివేతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ పోలో ప్రారంభం అయ్యింది.

నిజాం ఒప్పుకోలేదు..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ.. స్వతంత్ర భారత్‌లో కలవడానికి హైదరాబాద్ నిజాం ఒప్పుకోలేదు. అయితే.. అప్పటికే ఉన్న సంస్థానాలు ఇండియాలో కలవాలా? లేదా? అనే నిర్ణయం వాటిదే అని బ్రిటీష్ పాలకులు వదిలేశారు. ఆ సమయంలో సర్దార్‌‌ వల్లభబాయ్‌ పటేల్‌ చొరవ చూపి సంస్థానాల పాలకులతో సంప్రదింపులు జరిపారు. అవి మంచి ఫలితాలిచ్చాయి. దాదాపు 500 వరకు సంస్థానాలు ఇండియాలో కలిసిపోయాయి. కానీ.. హైదరాబాద్‌‌, కాశ్మీర్‌‌, జునాగఢ్‌‌ మాత్రం స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గుచూపాయి.

ప్రత్యేక దేశంగా గుర్తించాలని..

హైదరాబాద్‌‌‌ను ఇండియాలో కలుపుకోవాలా? స్వతంత్రంగా ఉండే అవకాశం ఇవ్వాలా.. అనే అంశంపై కొంతకాలం చర్చ జరిగింది. అప్పుడు సర్దార్ వల్లభబాయ్‌ పటేల్‌.. కచ్చితంగా ఇండియాలో కలపాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. నిజాం తన పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్.. అంటే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్‌‌నగర్, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, పర్బనీ, బీడ్, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్‌‌‌‌ను కలిపి ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశాడు.

పాకిస్తాన్‌లో కలపాలని ప్రయత్నం..

అటు ఇండియన్ యూనియన్.. ఇటు నిజాం మధ్య ఇదే అంశంపై పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్టేట్‌ను పాకిస్తాన్‌లో కలపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో.. నిజాం పాలకులు మరింత శక్తవంతంగా తయారయ్యేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆయుధాలు సమకూర్చుకొని.. తన సైన్యాన్ని మరింత పెంచుకున్నారు. ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలో దాదాపు 2 లక్షల మందిని సైన్యంగా నియమించుకున్నారు. వారు హైదరాబాద్ స్టేట్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలను పీడీంచడం మొదలు పెట్టారు. దీంతో ఎక్కువ మంది.. ప్రధానంగా హిందువులు ఇండియన్ యూనియన్‌లో కలవడానికి ఇష్టపడ్డారు. వారి మీదు నిజాం సైన్యం పంజా విసిరింది.

పటేల్ నిర్ణయంతో..

నిజాం చేస్తున్న చేర్యలను చూసి పటేల్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా హైదరాబాద్ స్టేట్‌ను స్వతంత్ర భారత్‌లో కలపాల్సిందేనని స్పష్టం చేయడంతో.. ఆపరేషన్ పోలో పేరుతో 1948 సెప్టెంబర్‌‌‌‌ 13న సైనిక చర్య మొదలైంది. దాదాపు 5 రోజుల పాటు ఆపరేషన్ పోలో కొనసాగింది. సైనిక చర్య ప్రారంభం కావడంతో.. ఇప్పటి తెలంగాణ.. అప్పటి హైదరాబాద్ స్టేట్ భయం గుప్పిట్లో బతికింది. అప్పుడు ఎవరి మీద అనుమానం వచ్చినా.. నిజాం సైన్యం మట్టుబెట్టేది. అలా వందలాది మంది తెలంగాణ ప్రజలు అమరులయ్యారు.

సెప్టెంబర్ 13న ప్రారంభం..

భారత బలగాలు సెప్టెంబర్ 13న తెల్లవారుజామున హైదరాబాద్‌‌ స్టేట్‌లోకి ప్రవేశించాయి. షోలాపూర్ -సికింద్రాబాద్ హైవేపై ఉన్న నల్​దుర్గ్​ కోట దగ్గర మొదటి దాడి జరిగింది. ఈ దాడి తర్వాత నల్​దుర్గ్ పట్టణానికి దగ్గరగా ఉన్న ఎత్తయిన ప్రాంతాన్ని భారత సైన్యం ఆధినంలోకి తీసుకుంది. 34 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చింది. అయితే.. నిజాం సైన్యం, రజాకార్లు కూడా గట్టిగా పోరాడారు. కానీ.. సైన్యం ముందు వారి బలం సరిపోలేదు. దీంతో లొంగిపోయారు. ఇటు విజయవాడ వైపు నుంచి లెఫ్టినెంట్ జనరల్ రుద్ర.. మిలటరీతో హైదరాబాద్ స్టేట్‌లోకి ప్రవేశించారు. మధ్యాహ్నం వరకు భారత ఆర్మీ మునగాల చేరుకుంది.

బలంగా దాడులు..

ఇండియన్​ ఆర్మీలోని ఒక దళం సెప్టెంబర్ 14న రాజేశ్వర్ పట్టణానికి చేరుకుంది. వైమానిక దాడులు చేసింది. విజయవాడ నుంచి వచ్చిన ఆర్మీని సూర్యాపేటకు 6 కిలోమీటర్ల దూరంలో రజాకార్లు, నిజాం సైనికులు ఆపారు. కానీ.. భారత సైన్యం చేతిలో ఓడిపోయారు. వారిపై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఇటు మేజర్ జనరల్ డీఎస్‌‌ బ్రార్ నేతృత్వంలోని దళం.. అదే రోజు ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది.

మూసీ నదిపై బ్రిడ్జ్‌ను కూల్చేశారు..

సూర్యాపేట వైపు నుంచి వస్తున్న దళాలను ఆపేందుకు హైదరాబాద్‌‌ ఆర్మీ.. సెప్టెంబర్ 15న మూసీ నది మీద ఉన్న బ్రిడ్జ్‌‌ని కూల్చేసింది. దీంతో ఇండియన్‌‌ ఆర్మీ భగ్గుమంది. నార్కెట్‌‌పల్లి దగ్గర హైదరాబాద్‌‌ సైన్యాన్ని చిత్తు చిత్తు చేసింది. ముందుకు దూసుకొచ్చింది. దాదాపు హైదరాబాద్ సమీపంలోకి వచ్చేసింది.

హైదరాబాద్ ఆర్మీ దాడులు..

లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని ఫోర్స్.. సెప్టెంబర్ 16న ఉదయం జహీరాబాద్ వైపు వచ్చింది. బీదర్‌‌ రోడ్డు జంక్షన్‌‌ దగ్గరకు రాగానే అనుకోకుండా హైదరాబాద్‌‌ ఆర్మీ దాడులు చేసింది. ఆ దాడులను ధీటుగా ఎదుర్కొన్న భారత సైన్యం.. జహీరాబాద్ దాటి హైదరాబాద్ వైపునకు 15 కిలోమీటర్లు ముందుకు వచ్చింది.

ఓటమి భయంతో..

భారత సైన్యం సెప్టెంబర్ 17న ఉదయం.. పటాన్‌‌చెరు వరకు వచ్చింది. విజయవాడ వైపు నుంచి వస్తున్న సైన్యం.. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని చిట్యాలకు చేరుకుంది. ఇంకో బృందం హింగోలి పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకుంది. దీంతో ఉస్మాన్ అలీఖాన్‌‌కు సీన్ అర్థమైంది. ఓటమి భయం పట్టుకుంది. ఇక యుద్ధం ముగుస్తుందని అర్థమైపోయి... సెప్టెంబర్ 17న సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించాడు. భారత సైన్యానికి హైదరాబాద్‌‌లోకి వెల్‌‌కమ్‌‌ చెప్పాడు. అప్పటికే భారత సైన్యం సికింద్రాబాద్‌‌కు చేరింది. దీంతో ఆపరేషన్ పోలో సమాప్తం అయ్యింది. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు ఇచ్చింది.