AWES Recruitment 2024 : ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - దరఖాస్తులు ప్రారంభం, ఇవిగో వివరాలు
AWES Recruitment 2024 : ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్ల పరిధిలోని 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 25వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పూర్తి కానుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వివరాలను ప్రకటించింది. ఇందులో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులను రిక్రూట్ చేయనుంది. డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేయటంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు.
క్లస్టర్ల వారీగా ఈ పోస్టులను రిక్రూట్ చేస్తారు. CLUSTER 6లో చూస్తే హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ (ఆర్‌కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి.
సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రాతపరీక్షతో పాటు టీచింగ్ స్కిల్క్ ఆధారంగా తుది నియామకాలు ఉంటాయి. అప్లయ్ చేసుకునే అభ్యర్థులు 01-04-2024 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి. బోధనలో అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హైదరాబాద్ ను పరీక్షా కేంద్రంగా ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా పలు సెంటర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం హైదరాబాద్ మాత్రమే సెంటర్ గా ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 41 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ జరగనుంది.
ఈ పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యరులు మొత్తం 200 మార్కులకు పరీక్ష రాయాల్సి(సెక్షన్ -ఏ, బీ, సీ) ఉంటుంది. మల్టీపుల్ చాయిస్ విధానంలో 200 ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పుకు 0.25 మార్కుల చొప్పున కట్ చేస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పులకు ఒకమార్కు కోత ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలుగా ఉంటుంది.
ఇందుకు సంబంధించిన పరీక్షలు నవంబర్ 23, 24 తేదీల్లో జరుగుతాయి. నవంబర్ 25వ తేదీని పరీక్ష రిజర్వ్ డేగా ప్రకటించారు. తుది ఫలితాలను డిసెంబర్ 10వ తేదీన ప్రకటిస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు https://www.awesindia.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సైట్ నుంచే హాల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.