TG Govt : విద్యాసంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం-hyderabad tg govt ordered to grant 5 percent reservation to differently abled in educational institutions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt : విద్యాసంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

TG Govt : విద్యాసంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Bandaru Satyaprasad HT Telugu
Jun 26, 2024 10:02 PM IST

TG Govt : వికలాంగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వికలాంగులకు ఉన్నత విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు, 5 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఇవ్వాలని ఆదేశించింది.

విద్యాసంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
విద్యాసంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

TG Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు బెంచ్మార్క్ వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఐదు శాతం కంటే తక్కువ కాకుండా సీట్లను రిజర్వ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. బెంచ్మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశానికి ఐదు సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

భారత ప్రభుత్వం వికలాంగుల హక్కుల చట్టం, 2016 మేరకు వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తి భాగస్వామ్యం కల్పించింది. ఈ చట్టం 2017లో అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 32 మేరకు ఉన్నత విద్యా సంస్థలో రిజర్వేషన్ కల్పించాలని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఐదు శాతం సీట్లను రిజర్వ్ చేయాలని చట్టంలో పేర్కొన్నారు. అలాగే బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశానికి ఐదు సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఈ నిబంధనల మేరకు బెంచ్‌మార్క్ వికలాంగులకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థలలో ప్రవేశాలకు 5% రిజర్వేషన్, 5 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపును వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు సాధ్యమా?

కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 23 శాతం రిజర్వేషన్లను 43 శాతానికి పెంచుతామని ప్రకటించింది. అయితే ఈ పెంపు సాధ్యం కాదని బీసీ కమిషన్‌ తేల్చి చెప్పింది. కులగణనకు సంబంధించి ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో బీసీ కమిషన్‌ దేశంలోని పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కర్ణాటకలో 54 ప్రశ్నలతో చేసిన కులగణన మాత్రమే శాస్త్రీయంగా ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో చేసిన కులగణన శాస్త్రీయంగా లేదని నివేదికలో పేర్కొ్న్నట్లు తెలిసింది. 2019లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో 2011 జనాభా లెక్కల ఆధారంగా పంచాయతీరాజ్‌ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ మేరకే బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల మేరకు ఎన్నికలు నిర్వహించారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతానికి మించకూడదు. రాజ్యాంగంలోని 243డి ఆర్టికల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభాను బట్టి ముందుగా వారికి కేటాయించిన తర్వాతే మిగతా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని పేర్కొంది. ఈ క్రమంలో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50 శాతం మించకూడదని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. దీంతో రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Whats_app_banner