Hyderabad : ఇద్దరు దాతల నుంచి అవయవ సేకరణ - వైద్య చరిత్రలో అరుదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స
Dual Lobe Liver Transplant Surgery: హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఓ వ్యక్తికి ఇద్దరు దాతల నుంచి సేకరించిన కాలేయాన్ని అమర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్లు వెల్లడించారు.
Liver Transplant Surgery in Hyderabad: కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి అరుదైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలోని వైద్యులు. 35 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు దాతల నుంచి సేకరించిన కాలేయాన్ని అమర్చారు. వైద్య చరిత్రలో ఇది అరుదైన శస్త్ర చికిత్స అని వైద్యులు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం లివర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు డాక్టర్ రాఘవేంద్రబాబు వెల్లడించారు.
కర్నూలుకు చెందిన ఎం మహేష్ అనే రోగికి ఈ సర్జరీ చేసినట్లు స్టార్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాహుల్ చెప్పారు. అయితే అతను అధిక బరువు (దాదాపు 116 కిలోలు) ఉండటంతో… అతనికి ఒకటి కంటే ఎక్కువ పరిమాణంలో కాలేయ మార్పిడి అవసరపడిందని చెప్పారు “చాలా మంది రోగులు ఇటువంటి వైద్య పరిస్థితుల నుండి బయటపడలేరు. అయితే.. డ్యూయల్ లోబ్ కాలేయ మార్పిడి ఇటువంటి రోగులకు ఆశాకిరణంగా మారింది” అని రాహుల్ తెలిపారు.
పలు రకాల విభాగలాకు చెందిన సీనియర్ వైద్యుల బృందం డిసెంబర్ 4వ తేదీన ఈ సర్జీని పూర్తి చేశారు. దాదాపు 16 గంటలలో ఈ శస్త్రచికిత్స పూర్తి అయింది. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత రోగిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. అయితే రోగికి అవసరమైన పూర్తి కాలేయాన్ని అతని భార్య నుంచి సేకరించే అవకాశం లేకపోయిందని… దీంతో మహేష్ సోదరుడికి కూడా పరీక్షలు నిర్వహించి కాలేయాన్ని సేకరించినట్లు ప్రకటించారు. రోగితో పాటు దాతలు కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.
"ఈ తరహా శస్త్ర చికిత్స అత్యంత సవాలుతో కూడినది. ఈ శస్త్రచికిత్సలు అత్యధికంగా విజయవంతమైన దేశాల్లో భారత్ తో పాటు దక్షిణ కొరియా ఉంది. చాలా అరుదుగా ఈ ఆపరేషన్లు జరుగుతాయి. మహేష్‌ని బ్రతికించుకోవడానికి ఇదొక్కటే ఎంపిక. అందుకే ఈ శస్త్ర చికిత్స చేశాం’’ అని రాఘవేంద్రబాబు అన్నారు.
రాఘవేంద్రబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ శస్త్ర చికిత్సలో ప్రముఖ వైద్యులు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రాఘురామ్ రెడ్డి, డాక్టర్ సునీల్, డాక్టర్ భరత్ కుమార్, డాక్టర్ టీవీ ఆదిత్య చౌదరి పాల్గొన్నారు.