RS Praveen Kumar : కాంగ్రెస్ గేట్లు తెరిస్తే చేరడానికి అసమర్థుడిని కాదు, బీఆర్ఎస్ లో చేరుతున్నా- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar Joins BRS : కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే టీఎస్పీఎస్సీ పదవిని తిరస్కరించానన్నారు.
RS Praveen Kumar Joins BRS : బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి(BSP) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా తాను కాదని అన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ (TSPSC Chairman)పదవి ఆఫర్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నుంచి కబురు వచ్చిందని, కానీ ఆ పదవిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. తనకు ఏ పదవులు అవసరం లేదన్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను బీఆర్ఎస్ లోకి చేరితే ప్రజలకు సమాధానం చెప్పాలనడం ఎంత వరకూ కరెక్ట్ అన్నారు. తెలంగాణ ప్రజలకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే అందులో చేరడానికి తాను అసమర్థుడిని కానన్నారు. నిజాయతీ కోసం పనిచేసే వ్యక్తినన్నారు.
నేను కూడా పాలమూరు బిడ్డే
తాను ఎప్పుడూ నిజాయితీకి కట్టుబడి ఉన్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఓ వైపు మంచివాడు అంటూనే రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారన్నారు. ఎన్ని కోట్లు తీసుకుని బీఆర్ఎస్(BRS) లో చేరుతున్నావని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. డబ్బు కోసం అయితే కాంగ్రెస్‌లో చేరుతా కానీ బీఆర్ఎస్ కాదు కదా అన్నారు. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుందన్నారు. బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతానన్నారు. రేవంత్ రెడ్డే కాదు తాను కూడా పాలమూరు బిడ్డనేనన్నారు.
ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చా
కాంగ్రెస్ (Congress)గేట్లు తెరిస్తే చాలా మంది పిరికిపందలు, స్వార్థపరులు, అసమర్థులు గొర్రెల మందలాగా వస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) విమర్శించారు. ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాదన్నారు. ఎంత ప్యాకేజీ తీసుకున్నావని సోషల్ మీడియాలో అంటున్నారని, ప్యాకేజీలకు ఆశపడితే అధికార పార్టీలోనే చేరేవాడినన్నారు. తెలంగాణ అభివృద్ధి అనే యజ్ఞం కోసమే బీఆర్ఎస్‌లో చేరుతున్నానన్నారు. ఆస్తులను రక్షించుకోవడానికి భయంతో కాంగ్రెస్ లోకి పారిపోయిన పిరికిపందను కానన్నారు. ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో పదేళ్లలో పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దానని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బెదిరించడం మానుకోవాలన్నారు. వార్నింగ్‌లు ఇచ్చి సీఎం హోదాను తగ్గించుకోవద్దని సూచించారు.
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి
తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... గజ్వేల్‌లోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు(KCR Farm House) ర్యాలీగా బయలుదేరారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
సంబంధిత కథనం