RS Praveen Kumar : మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీకి పెను భారం, ఆటో కార్మికుల ఉపాధికి దెబ్బ - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీతో ఆర్టీసీకి భారంగా మారుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దీంతో పాటు ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
RS Praveen Kumar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. శనివారం ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిచారు. అయితే ఉచిత ప్రయాణం కారణంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికి మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆటో కార్మికులపై ప్రభావం పడింది. మహిళా ప్రయాణికులు ఆటోలు ఎక్కడంలేదని వారు వాపోతున్నారు. దీనిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
ఆర్టీసీ కార్మికులపై ప్రభావం
ఇప్పుడిప్పుడే నష్టాల్లో నుంచి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారాన్ని మోపుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయన స్పందించారు. ఉచిత ప్రయాణం దాదాపుగా 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలపై ప్రభావం చూపబోతుందన్నారు. అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రకరకాల కారణాల వల్ల బంద్ పెట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను పునరుద్దరిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిందన్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
అదే విధంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తమకు తగినంత ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని భయపడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఊర్లల్లో తగిన పని దొరక్క పట్టణాలకు వలస వచ్చి రేకుల షెడ్లలో ఉంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పొట్టగడుపుకుంటున్న ఆటో డ్రైవరు సోదరులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం గొప్ప విషయమే అయినా ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 15 లక్షల మంది డ్రైవర్లున్నారన్న ఆయన... వారి కుటుంబ సభ్యులతో కలిపి 40 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని వాపోయారు. శనివారం తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.15 వేలు అందించాలని కోరారు. ప్రభుత్వం తమను ఏదో విధంగా ఆదుకోవాలని వేడుకున్నారు.