RRR Land Acquisition : ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి, అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతుల పట్టు-hyderabad rrr land acquisition farmers demands change alignment filed petition in high court ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rrr Land Acquisition : ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి, అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతుల పట్టు

RRR Land Acquisition : ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి, అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతుల పట్టు

HT Telugu Desk HT Telugu
Nov 02, 2024 06:08 PM IST

RRR Land Acquisition : ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణకు భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రస్తుత అలైన్ మెంట్ మార్చాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. . భూసేకరణ అవార్ విచారణ సమావేశాలను నిర్వాసితులు బహిష్కరిస్తున్నారు.

ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి, అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతుల పట్టు
ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి, అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతుల పట్టు

రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపులార్ / ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి తమ భూములు ఇవ్వమని రైతులు ఎందుకు తెగేసి చెబుతున్నారు. భూసేకరణ కోసం రెవిన్యూ అధికారులు నిర్వహించిన సమావేశాలను రైతులు ఎందుకు బహిష్కరించారు? అసలు రైతుల ప్రధాన డిమాండ్ ఏమిటి? కొద్ది రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు రేపుతున్న ప్రశ్నలివి. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ట్రిపులార్ ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏడు జిల్లాల పరిధిలోని 27 మండలాల్లోని 181 గ్రామాలను కలుపుతూ 352 కిలోమీటర్ల నిడివిలో నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో భూసేకరణ సమస్యగా మారింది. ప్రధానంగా ఉత్తర భాగంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని రైతాంగం ఈ రోడ్డు అలైన్ మెంట్ మార్చాల్సిందే అని పట్టుబడుతున్నారు.

ఉత్తర భాగ నిర్వాసితుల ఆందోళన

రీజినల్ రింగ్ రోడ్డును ఉత్తర, దక్షిణ భాగాలు విభజించారు. ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లా తూప్రాన్ నుంచి మొదలై, గజ్వేలు మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. ఈ భాగం నిడివి 158 కిలోమీటర్లు. దక్షిణ భాగం చౌటుప్పల్ వద్ద మొదలై షాద్ నగర్ మీదుగా సంగారెడ్డి వద్ద ముగుస్తుంది. ఈ భాగం నిడివి 194 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉత్తర భాగంలో భూ సేకరణ జరగుతుండగా, డెబ్బై శాతానికి పైగానే సేకరణ పూర్తయింది. కానీ, చౌటుప్పల్ ప్రాంత నిర్వాసితులు ట్రిపులార్ అలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర భాగంలో రోడ్ అలైన్ మెంట్ ను ఇష్టానుసారం మార్చారన్నది నిర్వాసితుల ప్రధాన అభియోగం. ఈ మేరకు కేంద్ర మంత్రలుకూ వినతి పత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ట్రిపులార్ మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉండాలన్నది నిబంధన. కానీ, మారిన అలైన్ మెంట్ వల్ల గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఈ దూరం కేవలం 28 కిలోమీటర్లుగా ఉంది.

తాము విలువైన వ్యవసాయ భూములను, ఇళ్ళు , నివాస స్థలాలను కోల్పోతున్నామని నిర్వాసితులు పేర్కొంటున్నారు. జంక్షన్ల విస్తరణ వల్ల కూడా మున్సిపాలిటీల పరిధిలోని గ్రామాలు విడిపోతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భూ సేకరణ కోసం రెవిన్యూ అధికారులు అవార్డ్ విచారణ కోసం అక్టోబరు 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆయా తహశీల్దారు కార్యాలయాల్లో నిర్వహించిన సమావేశాలను నిర్వాసితులైన రైతులు బహిష్కరించి ఆందోళనలు చేపట్టారు. ట్రిపులార్ ఉత్తరభాగంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 59.65 కిలోమీటర్ల రోడ్డు కోసం భూ సేకరణ జరుపుతున్నారు. తుర్కపల్లి - యాదగిరిగుట్ట మధ్య 19.99 కిలోమీటర్లు, వలిగొండ - చౌటుప్పల్ మధ్య 25.471కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరించాల్సి ఉంది.

విలువైన భూములు పోతున్నాయి

ఉత్తర భాగం ట్రిపులార్ నిర్మాణంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 గ్రామాల మీదుగా రోడ్డు వెళ్ళనుంది. దీనికోసం ఇప్పటికే 1927 ఎకరాల భూమిని సేకరించారు. అయతే, మారిన అలైన్ మెంట్ వల్ల విలువైన భూములను రైతులు కోల్పోతున్నారు. బహిరంగ మార్కెట్ లో ఎకరాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల దాకా ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం భూసేకరణ నష్టపరిహారంగా ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల కంటే ఎక్కువ చెల్లించే పరిస్థితి కనిపించడం లేదని, ఈ లెక్కన తామెంతగా నష్టపోతున్నామో అర్థం చేసుకోవాలని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి భూ సేకరణ ఒక విధంగా చివరి దశకు వచ్చింది. ముసాయిదా అవార్డ్ మేరకు రెవిన్యూ యంత్రాంగం రూ.207 కోట్లకు నేషన్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఎ.ఐ)కి ప్రతిపాదనలు కూడా పంపించింది.

ఒక్క వలిగొండ మండలంలో చెల్లింపులకే రూ.187 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్ కోసం అవసరమైన188 ఎకరాల భూమి సేకరణకూ తిప్పలు తప్పడం లేదు. ఇంటర్ చేంజ్ జంక్షన్ ఏర్పాటు కానున్న రాయగిరి వద్ద విలువైన భూములు పోతున్నాయని ఇప్పటికే రాయగిరి రైతులు 32 మంది హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ స్టే ఎత్తివేయడంతో రైతులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. తొలుత నిర్ణయించిన అలైన్ మెంట్ ను మార్చడం, ట్రిపులార్ కు రేడియల్ రోడ్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం, ఓఆర్ఆర్ కు ట్రిపులార్ మధ్య 40 కిలోమీటర్ల దూరం నిబంధనను పక్కన పెట్టడం వంటి కారణాలతో విలువైన భూములను కోల్పోతున్నామని బాధిత నిర్వాసిత రైతులు పేర్కొంటున్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner

సంబంధిత కథనం