TS Genco Exam : టీఎస్ జెన్ కో ఏఈ, కెమిస్ట్ రాత పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?-hyderabad news in telugu ts genco ae chemist written exam date announced ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Genco Exam : టీఎస్ జెన్ కో ఏఈ, కెమిస్ట్ రాత పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?

TS Genco Exam : టీఎస్ జెన్ కో ఏఈ, కెమిస్ట్ రాత పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?

Bandaru Satyaprasad HT Telugu
Feb 14, 2024 06:28 PM IST

TS Genco Exam : తెలంగాణ జెన్ కో ఏఈ, కెమిస్ట్ పోస్టుల రాత పరీక్ష తేదీ ఖరారైంది. మార్చి 31న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు జెన్ కో ప్రకటించింది.

 టీఎస్ జెన్ కో ఏఈ, కెమిస్ట్ రాత పరీక్ష తేదీ
టీఎస్ జెన్ కో ఏఈ, కెమిస్ట్ రాత పరీక్ష తేదీ (Unsplash)

TS Genco Exam : తెలంగాణ జెన్ కో లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల రాత పరీక్ష తేదీలపై అప్ డేట్ వచ్చింది. మార్చి 31న ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జెన్ కో ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. మార్చి 31న మూడు షిఫ్ట్ లలో పరీక్ష నిర్వహించనున్నారు. మెకానికల్, కెమిస్ట్ అభ్యర్థులకు షిఫ్ట్‌-1 ఉదయం 9.00 నుంచి 10.40 వరకు, ఎలక్ట్రికల్ అభ్యర్థులకు షిఫ్ట్‌-2 మధ్యాహ్నం 1.00 నుంచి 2.40 వరకు, సివిల్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు షిఫ్ట్‌-3 సాయంత్రం 5.00 నుంచి 6.40 వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.

399 పోస్టుల భర్తీ

టీఎస్ జెన్ కో సంస్థలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు పాత విద్యుత్ కేంద్రాలలో పనిచేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జెన్ కో ప్రకటించింది.

గతంలో ఒకసారి వాయిదా

తెలంగాణ జెన్‌కో లో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 5న నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తామ‌ని జెన్ కో ప్రక‌టించింది. అయితే వివిధ కారణాలతో ఈ పరీక్ష వాయిదా ప‌డింది. ఏఈ ఉద్యోగాల్లో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నట్లు జెన్ కో పేర్కొంది.

పరీక్ష విధానం

మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడగగా.. మిగతా 20 మార్కులు ఇంగ్లీష్, జనరల్ అవర్ నెస్, తెలంగాణ సంస్కృతితో పాటు పలు అంశాల నుంచి అడుగుతారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం - రూ.65,600 - రూ.1,31,220 (RPS-2022) ఉంటుంది. హాల్‌ టికెట్లను పరీక్షకు 7 రోజుల ముందు జెన్ కో అధికారిక వెబ్ సైట్ https://tsgenco.co.in/TSGENCO/home.do విడుదల చేస్తారు.

మీ-సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు

మీ సేవా సెంటర్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే నారాయణపేట జిల్లాలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలైంది. రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా…. ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఫిబ్రవరి 14,2024వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్య వివరాలు

ప్రకటన - ఈ- గవర్నెన్స్ సొసైటీ, నారాయణపేట జిల్లా.

సెంటర్లు - మీసేవా.

మొత్తం ఖాళీలు - 20 మీసేవా సెంటర్లు.

అర్హతలు - డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ - రాతపరీక్ష, ఇంటర్వూ ఉంటుంది.

మొత్తం మార్కులు - 100( 90 మార్కులు - ప్రశ్నలు, విద్యా అర్హతలు, సాంకేతిక ధ్రువపత్రాలు -05,ఇంటర్వూ -05 మార్కులు).

దరఖాస్తు రుసుం - రూ. 500.

వయసు - 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఫిబ్రవరి 14,2024.

పరీక్ష కోసం కాల్ లెటర్ - 21 ఫిబ్రవరి, 2024. ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు.

పరీక్ష తేదీ - 25 ఫిబ్రవరి 2024.

అధికారిక వెబ్ సైట్ - https://narayanpet.telangana.gov.in/

Whats_app_banner

సంబంధిత కథనం