Hyderabad Capital: హైదరాబాద్‌పై వైవీ సంచలన వ్యాఖ్యలు… పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్న బొత్స..-yvsubbareddy wants to keep hyderabad as joint capital for some more years ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hyderabad Capital: హైదరాబాద్‌పై వైవీ సంచలన వ్యాఖ్యలు… పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్న బొత్స..

Hyderabad Capital: హైదరాబాద్‌పై వైవీ సంచలన వ్యాఖ్యలు… పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్న బొత్స..

Sarath chandra.B HT Telugu
Feb 14, 2024 12:44 PM IST

Hyderabad Capital: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ ముఖ్య నాయకుడు వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్‌పై చేసిన వ్యాఖ‌్యలు కలకలం రేపుతున్నాయి.వైవీ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బొత్స ప్రకటించారు.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటున్న  వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటున్న వైవీ సుబ్బారెడ్డి

Hyderabad Capital: మరికొద్ది నెలల్లో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని హోదా ముగియనున్న తరుణంలో వైసీపీ ముఖ్య నాయకుడు వైవీ సుబ్బారెడ్డి Yv Subbareddy కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్నాళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ నాయకుడి వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటనే చర్చ జరుగుతోంది.

మరోవైపు వైవీ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వైసీపీ నష్ట నివారణకు దిగింది. వైవీ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని మంత్రి బొత్స ప్రకటించారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో పేర్కొన్నారని, అర్థరాత్రి ఓటుకు నోటు కేసులో దొరికి పోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌ వదిలి వచ్చేశారని టీడీపీపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైవీ ఉద్దేశం అపరిష్కృత అంశాలను పరిష్కరించడమేనని చెప్పారు. విభజన హామీలను నెరవేర్చడానికి పార్లమెంటు సభ్యుడిని అయ్యాక ప్రయత్నిస్తానని మాత్రమే వైవీ చెప్పారన్నారు. హైదరాబాద్‌పై చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని, తమ పార్టీ ఉద్దేశం కానే కాదని తేల్చి చెప్పారు.

వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీంకరించారన్నారు. ముందు వెనుక ఏమన్నారో చూడాల్సి ఉందన్నారు. సాంకేతికంగా ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదన్నారు. ఓటుకు నోటుకు కేసులో దొంగ పని చేసి రాత్రికి రాత్రి వచ్చేశారన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదన్నారు. పదేళ్ల తర్వాత అలాంటి నిర్ణయం సాధ్యం కాదన్నారు. సరైన ఆలోచన ఉన్న వాళ్లెవరు ఉమ్మడి రాజధాని అని వ్యాఖ్యలు చేయరన్నారు.

దుమారం రేపిన వైవీ వ్యాఖ్యలు…

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏమిటనే సందిగ్ధత పదేళ్లుగా ప్రజల్ని వేధిస్తూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాన్ని ఇంతవరకు అధికారికగా ఖరారు చేయలేదు. రాజధాని పేరుతో అమరావతి Amaravati ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి, పాలనా వ్యవహారాలు ప్రారంభించినా గత ఐదేళ్లుగా వైసీపీ మాత్రం మూడు రాజధానులని ప్రచారం చేస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏమిటనే విషయంలో ఏ ఒక్కరికి క్లారిటీ లేదు. పాలన సాగుతుంది కాబట్టి అమరావతిలోని వెలగపూడి Velagapudi ప్రాంతాన్ని రాజధానిగా భావిస్తున్నా నేడో రేపో తరలిస్తాం, కోర్టు కేసులు కొలిక్కి రాగానే విశాఖ నుంచే పాలన సాగిస్తామని వైసీపీ చెబుతోంది. ఈ క్రమంలో వైసీపీ ముఖ్య నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కోర్టు వివాదాలు ఉన్నందున మరికొన్నాళ్ల పాటు హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా Common capital కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున అవి తొలగి పోయే వరకు Hyderabad హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతామని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్నారు. త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.

ఈ క్రమంలో ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై కేంద్రంతో చర్చిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ రాజధానిగా ఏర్పడే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి వ్యాఖ్యలు కాకతాళీయంగా చేశారా, రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎన్నికల వేళ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు రావడంలో భాగంగా చేశారా అనే దానిపై స్పష్టత లేదు.

2019 డిసెంబర్‌లో ఏపీ అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల అంశాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి రకరకాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖపట్నంకు తరలి పోతున్నామంటూ నాలుగేళ్లుగా డజనుకు పైగా ముహుర్తాలు ప్రకటించారు. చివరి నిమిషంలో వాయిదా పడుతూ వచ్చింది. విశాఖ రాజధాని విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్న వైసీపీ కొంత కాలంగా ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.

మంగళవారం వైవీ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది 'రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వం శాశ్వత రాజధానిని నిర్మించ లేకపోయిందని తాత్కాలిక నిర్మాణాలే చేపట్టిందని వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మించే స్తోమత లేకపోవడంతో.. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలన రాజధానిగా చేద్దామనుకున్నామని చెప్పారు.

విశాఖ రాజధాని నిర్ణయంపై న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారని, వాటిని అధిగమించే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలన్నది మా ఆలోచన అన్నారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తోనూ, నాయకులతోనూ చర్చిస్తామని ఎన్నికల తర్వాత దీనిపై వివరణ ఇస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

వ్యక్తిగత అభిప్రాయం…

వైవీ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. వైవీ వ్యాఖ్యలు వ్యక్తిగతమై ఉంటాయని, పార్టీ విధానం కాకపోవచ్చని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరికొంత కాలం పొడిగిస్తే మంచిదేనన్నారు.

తప్పు పడుతున్న టీడీపీ….

ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అదికారంలోకి వచ్చిన సీఎం జగన్.. తర్వాత మూడు రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజమె త్తారు. నేడు ఓడిపోతామనే భయంతో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీ భూములను కాపా డుకోవడానికి కొత్త నాటకానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రాజధాని నిర్మాణానికి వెచ్చించాల్సిన నిధులన్నీ సొంత ఖర్చులకు, కేసుల మాఫీకి ఖర్చు పెట్టారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కాదు' అని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నాయకుడు సత్యకుమార్‌ కూడా వైవీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో వైవీ సుబ్బారెడ్డికి అవగాహన ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేయడంలో వైసీపీ నేతలు ఆరితేరిపోయారన్నారు.

Whats_app_banner