Sai Dharam Tej : సోషల్ మీడియాలో మానవ మృగాలు-చిన్నారుల భద్రతపై సాయి ధరమ్ తేజ్ ఆందోళన, స్పందించిన డిప్యూటీ సీఎం
Sai Dharam Tej On Child Abuse : చిన్నారులపై కోరలు చాస్తున్న సోషల్ మీడియా మృగాలపై చర్యలు తీసుకోవాలని హీరో సాయి ధరమ్ తేజ్ ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.
Sai Dharam Tej On Child Abuse : సోషల్ మీడియాలో విచ్చలవిడితనం, విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయి. ట్రోలింగ్ పేరుతో చాలా నీచంగా వ్యవహరిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా భూతం మరింత రెచ్చిపోతుంది. ఇక పిల్లలపై సైతం సోషల్ మీడియా రక్కసి కోరలు చాస్తుంది. దీనిపై టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. శనివారం ఎక్స్ మాధ్యమంలో పోస్టు పెట్టారు. తల్లిదండ్రులు తన పిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసే ముందు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియాలో మానవ మృగాలు
సోషల్ మీడియాలోని కొన్ని భయంకరమైన మానవ మృగాల నుంచి మన పిల్లలను రక్షించుకోవాలని సాయి ధరమ్ తేజ్ అన్నారు. పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియా క్రూరంగా, అసహ్యంగా, భయానకంగా మారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని మానవ మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదన్నారు. సోషల్ మీడియాలో చిన్న పిల్లల భద్రతపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని హీరో సాయి ధరమ్ తేజ్ కోరారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రి నారా లోకేశ్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు.
స్పందించిన డిప్యూటీ సీఎం
హీరో సాయి ధరమ్ తేజ్ పోస్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశం అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల ఫొటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మన పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దామని ఆయన అన్నారు.
"ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సాయి ధరమ్ తేజ్. మన ప్రభుత్వానికి పిల్లల భద్రత అత్యంత ప్రాధాన్యత అంశం. ఈ ఘటనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం"- సీఎం రేవంత్ రెడ్డి
ఐఏఎస్ కుమారుడు అసహ్య వ్యాఖ్యలు
ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు తన స్నేహితులతో లైవ్ సెషన్‌లో పిల్లలపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. తండ్రి, తన చిన్నారితో ఉన్న వీడియోపై మాట్లాడుతూ..యూట్యూబర్లు లైంగిక వ్యాఖ్యలు, జోక్‌లు వేస్తూ మాట్లాడారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యూస్ కోసం చాలా మంది యూట్యూబర్‌లు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటిపై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ యూట్యూబర్ తండ్రి తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారి కావడంతో ఐఏఎస్ అధికారుల కుమారులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించడంతో యూట్యూబర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలని, కఠినమైన చట్టాలు అమలు చేయాలని అమలు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. పరిధి దాటి వ్యవహరించిన వారికి శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం