Vishwak Sen: పైరసీ కంటే డేంజరస్: యూట్యూబర్‌పై హీరో విశ్వక్‍సేన్ ఫైర్-vishwak sen fires on youtuber who compares kalki 2898 ad movie to hollywood films says some people dangerous than piracy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: పైరసీ కంటే డేంజరస్: యూట్యూబర్‌పై హీరో విశ్వక్‍సేన్ ఫైర్

Vishwak Sen: పైరసీ కంటే డేంజరస్: యూట్యూబర్‌పై హీరో విశ్వక్‍సేన్ ఫైర్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 18, 2024 08:49 PM IST

Vishwak Sen: కల్కి 2898 ఏడీ సినిమాపై ఓ యూట్యూబర్ చేసిన వీడియోపై విశ్వక్‍సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలీజ్ కూడా కాకముందే చెంబులు పట్టుకొని బల్దేరారంటూ ఘాటుగా స్పందించారు. దీనిపై ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు.

Vishwak Sen: పైరసీ కంటే డేంజర్: యూట్యూబర్‌పై విశ్వక్‍సేన్ ఫైర్
Vishwak Sen: పైరసీ కంటే డేంజర్: యూట్యూబర్‌పై విశ్వక్‍సేన్ ఫైర్

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్.. తన అభిప్రాయాలను సూటిగా చెబుతారు. ఏదైనా విషయం నచ్చకపోతే తన స్టైల్‍లో స్పందిస్తారు. సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు విశ్వక్ చేసిన కామెంట్లు కాస్త కాంట్రవర్సీలను కూడా క్రియేట్ చేశారు. కాగా, ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా గురించి ఓ యూట్యూబర్ చేసిన వీడియోపై విశ్వక్‍సేన్ అసహనం వ్యక్తం చేశారు. కొన్ని హాలీవుడ్ మూవీల పోలికలు.. కల్కిలో కనిపిస్తున్నాయని చెప్పడంపై ఫైర్ అయ్యారు. ఈ విషయంపై నేడు (జూన్ 18) ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు.

రిలీజ్ కాకముందే వచ్చేస్తారు..

కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ గురించి బార్‌బెల్ పిచ్ మీటింగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‍లో ఓ యూట్యూబర్ వీడియో చేశారు. ట్రైలర్‌పై తన అభిప్రాయాలను అతడు తెలిపారు. ఈ క్రమంలో మ్యాడ్‍మ్యాక్స్, బ్యాట్‍మాన్ సహా కొన్ని హాలీవుడ్ సినిమాల రిఫరెన్సులను కల్కి మేకర్స్ తీసుకున్నారని ఆ యూట్యూబర్ అన్నారు. హాలీవుడ్‍ను దున్నేద్దాం అని అనుకోవడం సరికాదంటూ కామెంట్లు చేశారు. దీంతో విశ్వక్‍సేన్ ఫైర్ అయ్యారు. ఈ వీడియోను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి మరీ ఘాటు కామెంట్లు చేశారు.

సినిమా రిలీజ్ కాకుండానే కొందరు వచ్చేస్తున్నారని విశ్వక్‍సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పైరసీ కంటే ప్రమాదకరమైన వ్యక్తులు అని ఆ యూట్యూబర్‌ను ఉద్దేశించి రాసుకొచ్చారు. “సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబులు పట్టుకొని బయలుదేరుతున్నారు. యూట్యూబ్‍లో మీ ఆదాయం కోసం వేల కుటుంబాలు నడుస్తున్న ఇండస్ట్రీతో మజాక్‍లు అయిపోయాయి మీకు” అని విశ్వక్ ఫైర్ అయ్యారు.

యూట్యూబర్‌కు ఛాలెంజ్

కల్కిపై ఈ వీడియో చేసిన యూట్యూబర్ ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయాలని విశ్వక్‍సేన్ ఛాలెంజ్ చేశారు. “వీడు ఒక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం మనం. లేదంటే అడ్రెస్ తప్పిపోయిన వాళ్లు అనుకొని పట్టించుకోకుండా వదిలేద్దాం. అభిప్రాయాలను బయట బజార్లో పెట్టి తిరిగే ఇలాంటి వాళ్లు అందరూ 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి” అని విశ్వక్ రాసుకొచ్చారు.

సినిమాల కోసం పని చేసే వారి కష్టాన్ని ఇలాంటి వారు అర్థం చేసుకుంటారని తాను ఆశిస్తున్నానని విశ్వక్‍సేన్ పోస్ట్ చేశారు. “ఇక్కడ ఉన్న కొంతమంది పైరసీ కంటే ప్రమాదమైకరమైన వారు. సినిమా సెట్‍లో ప్రతీ రోజు పని చేసే వారి చెమట, రక్తం, ఉపాధిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని విశ్వక్ పేర్కొన్నారు. “ఒక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తియ్యి. అప్పుడు నీకు, నీ ఒపీరియన్‍కు కాస్త గౌరవం ఉంటుంది” అని విశ్వక్‍సేన్ రాసుకొచ్చారు.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమా సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీగా రూపొందింది. ఈ చిత్రం జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ సినిమా అదరగొడుతుందనే అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్‍లోనూ ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ ఉంది. అమెరికాలో అప్పుడే ప్రీమియర్ల బుకింగ్‍లో రికార్డులను సృష్టిస్తోంది.

విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ మూవీకి బాగానే వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా జూన్ 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాలో హీరోగా నటిస్తున్నారు విశ్వక్.

Whats_app_banner