CM Revanth Reddy : ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది, ఎవడొస్తాడో చూస్తా- సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్-hyderabad cm revanth reddy fires on brs warning to kcr ktr dare to touch rajiv gandhi statue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది, ఎవడొస్తాడో చూస్తా- సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

CM Revanth Reddy : ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది, ఎవడొస్తాడో చూస్తా- సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

Bandaru Satyaprasad HT Telugu
Sep 16, 2024 07:19 PM IST

CM Revanth Reddy : వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టుకున్న వాళ్లకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే...కేటీఆర్ ఇడ్లీ,వడ అమ్ముకునే వారని విమర్శించారు.

ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది, ఎవడొస్తాడో చూస్తా- సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది, ఎవడొస్తాడో చూస్తా- సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

CM Revanth Reddy : 'రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే...కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వారు' అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొ్న్నారు. ఇది రాజకీయ వేదిక కాదు..ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం తనకు ఇష్టం లేదన్నారు. కానీ కొంతమంది చిల్లరమల్లరగా మాట్లాడేవారికి ఈ వేదికగా తాను కొన్ని విషయాలు గుర్తు చేయదలచుకున్నానన్నారు. అడ్డగోలుగా వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయదలచుకున్నానన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూదన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం సర్వం కోల్పోయిన కుటుంబం నెహ్రూ కుటుంబం అన్నారు.

"563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూది. మతకల్లోలాలతో దేశంలో రక్తం ఏరులై పారుతుంటే దార్శకనికతను ప్రదర్శించి శాంతిని నెలకొల్పింది నెహ్రూ కాదా?. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దేశ భవిష్యత్ కు పునాదులు వేసిన ఘనత నెహ్రూది. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ మనకు అందించిన సంపద. కొంతమంది సన్నాసులు వారసత్వ రాజకీయల గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ బ్రతికి ఉండగా ఇందిరా గాంధీ ఏ పదవి తీసుకోలేదు. ఇప్పటికీ ఇందిరమ్మను పేదలు దేవతలా పూజిస్తున్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి పేదల అభివృద్ధికి కృషి చేశారు. రాజభరణాలు రద్దు చేసి ఘనత ఇందిరాగాంధీది.

దళిత,గిరిజన, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూములు పంచి పెట్టిన ఘనత ఇందిరమ్మది. పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదలకు సొంతింటి కలను నిజాం చేసింది ఇందిరమ్మ కాదా? లంబాడాలను ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ కాదా? దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేసిన త్యాగశీలి ఇందిరమ్మ" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు దేశ ప్రజల కోసం ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భవిత యువత చేతుల్లో ఉండాలని 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ కాదా? అని ప్రశ్నించారు. 'రాజ్యాంగాన్ని సవరించి గ్రామ పంచాయతీలకు నిధులు చేరేలా సంస్కరణలు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీది కాదా? స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ కాదా? ఆడబిడ్డలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించింది రాజీవ్ కాదా? ఐదేళ్లపాటు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని వాళ్లు మాహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుంది? దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ' అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ
సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ

గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వారు

"రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే...కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ,వడ అమ్ముకునే వారు..లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వారు.రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయడం వల్లే కేటీఆర్ ఈ స్థాయికి చేరారు. వాళ్లకు అధికారం పోయినా మదం దిగలేదు. రాజీవ్ గాంధీ మరణించినా సోనియమ్మ ఏ పదవీ తీసుకోలేదు. 2004 నుంచి 2014 వరకు సోనియా, రాహుల్ ఏ పదవీ తీసుకోలేదు. ప్రాణ త్యాగం అంటే ఇందిరా, రాజీవ్ లది. పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలది. తెలంగాణ బిడ్డ పీవీని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది" - సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, పదవులు పంచుకున్న వాళ్లు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గడీలలో గడ్డి మొలవాల్సిందేనని ఆనాడు చాకలి ఐలమ్మ చెప్పిందన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా..మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్లు మొలవాల్సిందే అన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరన్నారు. వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టు కున్న వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా? అని ప్రశ్నించారు.

ఎవడ్రా తొలగించేది... ఎవడొస్తాడో చూస్తా

"మేం రాజీవ్ విగ్రహం పెడతామనాగానే వీళ్లకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందట. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడం సముచితం కాదా? అని తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారు. ఎవడ్రా తొలగించేది... ఎవడొస్తాడో చూస్తా.. పదేళ్లు మీకు సోయి లేదు కాబట్టే... మేం సచివాలయంలో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.

తెలంగాణ పరిపాలనకు గుండెకాయ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి చూపిస్తాం. డిసెంబర్ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉంటుందని రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తున్నాం. ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపునకు కూడా వెళ్లని వ్యక్తి కేసీఆర్. కానీ మేం IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం" - సీఎం రేవంత్ రెడ్డి

మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు. కేసీఆర్ అధికారం పోయిందన్న అక్కసుతో అందుకే కొంతమంది చిల్లరగాళ్లను మనపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. కాలకేయ ముఠా మిడతల దండుగా మారి తెలంగాణను మింగేసేందుకు మళ్లీ ఊళ్లమీదకు రాబోతోందన్నారు. తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కండి...ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలని పిలుపునిచ్చారు.

సంబంధిత కథనం