CM KCR : వీఆర్ఏలు ఇకపై పే స్కేలు ఉద్యోగులు, 61 ఏళ్లు దాటిన వారి పిల్లలకు ఉద్యోగాలు- సీఎం కేసీఆర్-hyderabad cm kcr released vras permanent govt order adjusted in other departments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : వీఆర్ఏలు ఇకపై పే స్కేలు ఉద్యోగులు, 61 ఏళ్లు దాటిన వారి పిల్లలకు ఉద్యోగాలు- సీఎం కేసీఆర్

CM KCR : వీఆర్ఏలు ఇకపై పే స్కేలు ఉద్యోగులు, 61 ఏళ్లు దాటిన వారి పిల్లలకు ఉద్యోగాలు- సీఎం కేసీఆర్

Bandaru Satyaprasad HT Telugu
Jul 24, 2023 09:01 PM IST

CM KCR : వీఆర్ఏలు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మందిని వారి విద్యార్హతల బట్టి వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నామన్నారు.

సీఎం కేసీఆర్ వీఆర్ఏలు
సీఎం కేసీఆర్ వీఆర్ఏలు

CM KCR : వీఆర్ఏలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వీఆర్ఏలుగా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మొత్తం 20,555 మంది వీఆర్‌ఏలను సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆదివారం సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి సోమవారం వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు జీవో జారీచేశారు. ఈ ఉత్తర్వుల కాపీని సీఎం కేసీఆర్ వీఆర్‌ఏ జేఏసీ నేతలకు అందజేశారు.

వీఆర్ఏల క్రమబద్దీకరణ

భూస్వామ్య వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా వీఆర్ఏ వ్యవస్థ కొనసాగిందని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం తీసుకునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ జీతంతో వీఆర్ఏలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణను వీరంతా అభినందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న వీఆర్ఏలందరికీ సీఎం శుభాభినందనలు తెలిపారు. 10 వ తరగతి అర్హత కలిగిన వారు 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాతో, డిగ్రీ ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చిందన్నారు.

వీఆర్ఏలు ఇకపై పే స్కేల్ ఉద్యోగులు

మరో కేటగిరీలో 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వారికి, వారు ఇంత కాలం చేసిన సేవకు గాను, మానవీయ కోణంలో ఆలోచించి, వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్ తోనే వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వీఆర్ఏల జేఏసీ ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ లిస్తామన్నారు. ఈ ఆర్డర్ లోనే ఆ విషయాలను పొందుపరిచినట్లు సీఎం తెలిపారు. వీఆర్ఏలు వారి పిల్లలను తీసుకొని వస్తే వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందన్నారు. వీఆర్ఏలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు అని సీఎం స్పష్టం చేశారు. మీరందరూ ఆయా డిపార్ట్మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని కోరుతున్నానని సీఎం సూచించారు. మంత్రి కేటీఆర్ ఈ ప్రక్రియ తొందరగా పూర్తయ్యేలా, మీ దగ్గరకు చేరేలా చొరవ తీసుకున్నందున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉత్తర్వులిస్తే ఇస్తే బాగుంటందని సూచించి, సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ రోజే ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేశారని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించినందుకు వారికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Whats_app_banner