Harish Rao : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీని చేర్చుకుని.. చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం: హరీష్‌ రావు-harish rao objected to appointment of patnam mahender reddy as chief whip ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీని చేర్చుకుని.. చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం: హరీష్‌ రావు

Harish Rao : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీని చేర్చుకుని.. చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం: హరీష్‌ రావు

Basani Shiva Kumar HT Telugu
Oct 13, 2024 02:45 PM IST

Harish Rao : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వడంపై మాజీమంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని ట్వీట్ చేశారు. రాజ్యాంగం ఖూనీ జరుగుతోందని ఆరోపించారు.

మాజీమంత్రి హరీష్ రావు
మాజీమంత్రి హరీష్ రావు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. దీనిని మాజీమంత్రి హరీష్ రావు ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ను నియమించారని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి సునీతా మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

'బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీని చేర్చుకుని చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్‌రెడ్డికి చీఫ్ విప్‌ పదవి ఎలా ఇస్తారు.? అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్‌ ఛైర్మన్‌.. స్వయంగా చీఫ్‌ విప్‌ ఎంపికైనట్లు బులెటిన్‌ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం. పట్నం మహేందర్‌రెడ్డి అనర్హత పిటిషన్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ దగ్గర పెండింగ్‌లో ఉంది. రేవంత్‌ హయాంలో రాజ్యాంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇది నిదర్శనం' అని హరీష్‌ రావు ట్వీట్ చేశారు.

మహేందర్‌రెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా నియమిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గత మార్చి 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని గెజిట్‌ విడుదల చేసింది. గెజిట్‌ను ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన ప్రభుత్వం.. ఇటీవల విడుదల చేసింది. అయితే.. తమ పార్టీ నుంచి అర్హులైన శాసనమండలి సభ్యులు లేరనే నిస్సహాయ స్థితిలో.. బీఆర్‌ఎస్‌ సభ్యుడికి కీలక పదవి ఇచ్చిందని కారు పార్టీ ఆరోపించింది.

పట్నం మహేందర్‌రెడ్డి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోకపోగా.. తాజాగా శాసనమండలి చీఫ్‌ విప్‌గా నియమించారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడిని ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఎలా నియమిస్తారని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రశ్నిస్తోంది.

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌‌లో చేరిన అరికెపూడి గాంధీని అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా నియమించారు. దానిపై స్పీకర్‌ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వకముందే మరొకరికి ఇలా అవకాశం ఇవ్వడంపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. దీనిపై మరోసారి మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉంది.

Whats_app_banner