Harish Rao on GO 33: జీవో 33తో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయంపై హరీష్‌ రావు ఆగ్రహం-injustice for telangana in mbbs bds admissions with jio number 33 harish rao angry ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao On Go 33: జీవో 33తో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయంపై హరీష్‌ రావు ఆగ్రహం

Harish Rao on GO 33: జీవో 33తో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయంపై హరీష్‌ రావు ఆగ్రహం

Sarath chandra.B HT Telugu
Aug 08, 2024 11:50 AM IST

Harish Rao on GO 33: ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ అడ్మిషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 33పై అసంతృప్తి రేగుతోంది. ఇప్పటికే ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ తప్పు పట్టగా తాజాగా విద్యార్థుల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

జీవో 33తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయంపై హరీష్‌కు వినతి పత్రం ఇస్తున్న పేరెంట్స్
జీవో 33తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయంపై హరీష్‌కు వినతి పత్రం ఇస్తున్న పేరెంట్స్

Harish Rao on GO 33: ఎంబిబిఎస్, బిడిఎస్‌ అడ్మిషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 33పై చిచ్చు రాజుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులను బీఆర్‌ఎస్ తప్పు పట్టింది. తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్ధుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని హరీష్ ఆరోపించారు.

తాజాగా ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జో.వో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీష్‌రావుతో భేటీ అయ్యారు. ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కొల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

నాలుగేళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్ లోకల్ కావడం బాధగా ఉందని తల్లిదండ్రులు వాపోయారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బిడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే జి.వో 33 పై పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించాలన్నారు. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే…

తెలంగాణ రాష్ట్రంలోని విద్యాలయాల్లో ప్రవేశాలకు విభజన చట్టం ప్రకారం 2024 జూన్‌ 2 దాకా పాత పద్ధతే కొనసాగించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా పదేండ్లు ముగియడంతో తెలంగాణ స్థానికతను నిర్ధారించాల్సి ఉంది.ఇంటర్‌తో పాటు మెడికల్‌, ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, లా.. ఇలా అన్ని స్థాయిలలో, అన్ని విద్యాలయాల్లో అడ్మిషన్లకు సొంత విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంది.

స్థానికత విషయంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సొంత విధానాలు రూపొందించుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకపోవడంతో జీవో నంబర్ 33 రూపొందించారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.

జీవో నంబర్ 33 రూపకల్పనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ, న్యాయ విభాగాధిపతులు ఏం చేస్తున్నారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యావంతులు, విషయ నిపుణులతో సమాలోచనలు జరిపి, ఒక ఉన్నతస్థాయి కమిటీవేసి విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, రాష్ట్ర పునర్విభజన గడువు ముగిసే 6-7 నెలల ముందే ఈ కసరత్తు ప్రారంభం కావాల్సి ఉన్నదని, ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని హరీష్‌ ప్రశ్నించారు.

1979లో స్థానిక ఉత్తర్వులు..

1979లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల విషయంలో 646 జీవో విడుదల చేసిందని హరీష్‌రావు చెప్పారు. జీవో ప్రకారం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 85 సీట్లు స్థానికులకు, 15 శాతం ఓపెన్‌ క్యాటగిరీగా పేర్కొన్నారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో పదేండ్లపాటు విద్యాలయాల ప్రవేశాల్లో ఇదే నిబంధనను యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మెడికల్‌ అడ్మిషన్లకు సంబంధించి 2017లో అదే జీవోను యథావిధిగా కొనసాగించారు.

2024 జూన్ 2తో జీవో 646 గడువు తెలంగాణలో ముగియడంతో ఈ ఏడాది మెడికల్‌ అడ్మిషన్లలో స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జీవో 33 ఇచ్చింది. 1979, 2017లో జారీ చేసిన ఉత్తర్వుల్లోని రెండు అంశాలనే కొత్త జీవోలో కూడా పొందుపరిచి దాన్నే స్థానికతగా పేర్కొనటంతో తెలంగాణ స్థానికులకు అన్యాయం జరుగుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం కనీస అధ్యయనం లేకుండా ఉత్తర్వులు ఇవ్వటం వల్ల తెలంగాణ విద్యార్థులు తెలంగాణలో స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడింది.

చివరి నాలుగేళ్లు కీలకం…

ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ అడ్మిషన్లకు చివరి విద్యాసంవత్సరానికి( ఇంటర్‌కు ముందు నాలుగేళ్లు) ఎక్కడ చదివితే అదే స్థానికతగా ప్రభుత్వం జీవో 33లో పేర్కొన్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికతగా జీవోలో పేర్కొన్నారు. నీట్‌ పరీక్ష రాయటానికి ముందు ఏడేళ్లు తెలంగాణలోనే చదవాలని లేదా గరిష్ఠంగా నాలుగేళ్లు తెలంగాణలో చదివినా లోకల్‌ అవుతారన్న నిబంధనను తొలగించడంతో తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి అన్యాయం జరుగుతోంది. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఏపీలో హాస్టళ్లలో విద్యాభ్యాసం చేస్తుంటారు. ఇంటర్‌ తెలంగాణ వెలుపల చదివిన వారికి మెడికల్‌ సీట్లలో స్థానికత కోటా వర్తించకపోవడాన్ని తప్పు పడుతున్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవోతో ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు నాన్‌లోకల్‌ అయిపోతారు.

సీట్లు పెరిగినా విద్యార్ధులకు అన్యాయమే…

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి 20 మెడికల్‌ కాలేజీలు, 2,850 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉండేవి. పదేళ్లలో మెడికల్‌ కాలేజీల సంఖ్యను 20 నుంచి 36కు పెంచారు. సీట్ల సంఖ్య దాదాపు 9 వేలకు చేరింది. పెరిగిన సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని అనేక జాగ్రత్తలు తీసుకున్నా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మెడికల్‌, ఇంజనీరింగ్‌ సహా అన్ని విద్యాలయాల అడ్మిషన్లలో 15 శాతం ఓపెన్‌ కాంపిటీషన్‌ 2024 వరకు అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన 20 మెడికల్‌ కాలేజీల్లోని 2,850 సీట్లలో 280 సీట్లు 15శాతం కోటాలో ఇశచ్చేవారు. ఏపీలో కూడా 15 శాతం కోటా జూన్ వరకు అమలు చేశారు. తాజాగా స్థానికత విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 33తో తెలంగాణ వారికి సీట్లు దక్కకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.