TS Graduate MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటుపై పట్టభద్రులకు పట్టింపేదీ..?-graduates are not interested in mlc vote registration 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Graduate Mlc Vote Registration : ఎమ్మెల్సీ ఓటుపై పట్టభద్రులకు పట్టింపేదీ..?

TS Graduate MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటుపై పట్టభద్రులకు పట్టింపేదీ..?

HT Telugu Desk HT Telugu
Jan 31, 2024 04:57 PM IST

TS Graduate MLC Vote Registration 2024: త్వరలో ఉపఎన్నిక జరగనున్న వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనున్నప్పటికీ పట్టభద్రులు పెద్దగా ఆసక్తి కనబర్చటం లేదు.

ఎమ్మెల్సీ ఓటుపై పట్టభద్రులకు పట్టింపేదీ..?
ఎమ్మెల్సీ ఓటుపై పట్టభద్రులకు పట్టింపేదీ..? (https://ceotelangana.nic.in/)

Telangana Graduate MLC Voter Registration 2024: విద్యావంతులు ఎమ్మెల్సీ ఓటు హక్కుకు ఇంట్రస్ట్ చూపడం లేదు. ఆ.. మళ్లీ ఏం నమోదు చేసుకుంటాంలే.! అంటూ నిట్టూరుస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చూపిన ఉత్సాహం ఈసారి కరువైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు కోసం పట్టభద్రులు అస్సలు ముందుకు కదలడం లేదు. దరఖాస్తుకి వారు మొగ్గు చూపనట్లే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా అంతే మందకొడిగా కొనసాగుతోంది.

ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుకు ఫిబ్రవరి 6వ తేదీన గడువు ముగియనుండగా ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 56,179 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అందులో పరిశీలన పూర్తయినవి 4,137 మాత్రమే ఉన్నాయి. గత ఎన్నికల్లో లక్షకుపైగా దరఖాస్తులు నమోదు కాగా ఈసారి అందులో సగం మాత్రమే నమోదవ్వడం వారిలో నిరాసక్తతను తెలుపుతోంది. పోటీ చేసే అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతో పాటు ఓటరు నమోదుపై రాజకీయ పార్టీల ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ దుస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఎక్కడెక్కడ ఏంటి పరిస్థితి..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 13,550 మంది పట్టభద్రులు మాత్రమే ఓటరుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో పరిశీలన అనంతరం ఆన్లైన్లో అప్ లోడ్ చేసినవి 1,100 లోపు మాత్రమే ఉన్నాయి. అశ్వాపురం మండలంలో 500, దుమ్ముగూడెం మండలంలో 255, భద్రాచలం మండలంలో 550 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ పూర్తి కాలేదు. చండ్రుగొండ మండలంలో 248 దరఖాస్తులకు గాను 6, టేకులపల్లి మండలంలో 731, అశ్వారావుపేట మండలంలో దాదాపు 491 దరఖాస్తులకు గాను ఒక్కొక్కటి చొప్పున మాత్రమే వెరిఫికేషన్ పూర్తయ్యాయి. కొత్తగూడెం, మణుగూరు లాంటి మండలాల్లో దాదాపు 300 దరఖాస్తుల చొప్పున వెరిఫికేషన్ పూర్తయ్యింది.

ఖమ్మం జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 42, 629 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఆన్లైన్ ద్వారా 41,572 అప్లికేషన్లు రాగా, ఆఫ్ లైన్ ద్వారా 1057 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 3,037 అప్లికేషన్లను యాక్సెప్ట్ చేయగా, 53 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. 39,539 అప్లికేషన్లు బి.ఎల్.ఓ స్థాయిలో, ఆర్వోల స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి. కొణిజర్ల, కూసుమంచి,

పెనుబల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం. వేంసూరు, వైరా మండలాల్లో ఒక్కో మండలంలో వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినా ఒక్క దరఖాస్తు కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు. ఇక ఏన్కూరు, మధిర, రఘునాథపాలెం మండలాల్లో సింగిల్ డిజిట్ లోనే దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ముదిగొండ, ఖమ్మం రూరల్, చింతకాని మండలాలు మాత్రం దరఖాస్తుల పరిశీలనలో కాస్త ముందంజలో ఉన్నాయి.

ప్రచార లోపం..

పట్టభద్రుల ఓటరు నమోదు మందకొడిగా సాగుతుండటంతో పలు శాఖల ఆఫీసర్లతో ఇరు జిల్లాల కలెక్టర్లు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కలెక్టర్లు ఒక దశలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆశించినంత ఫలితం మాత్రం రావడం లేదు. అలాగే పలు రాజ్

రాజకీయ పార్టీల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఫైనల్ కాకపోవడంతో అటు పార్టీలు, ఇటు సంఘాలు సైతం ఓటరు నమోదుపై పెద్దగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ఓటరు నమోదుకు మరో వారం రోజు మాత్రమే గడవు ఉన్నందున ఇప్పటికైనా పార్టీలు, సంఘాలు, అధికారులు ఈ ఎన్నికల్లో ఓటు వినియోగం ప్రాధాన్యతపై ప్రచారం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

IPL_Entry_Point

సంబంధిత కథనం