TS High Court on Mlc Swearing : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్, హైకోర్టు కీలక ఆదేశాలు-hyderabad news in telugu ts high court orders no swearing ceremony to governor quota mlcs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court On Mlc Swearing : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్, హైకోర్టు కీలక ఆదేశాలు

TS High Court on Mlc Swearing : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్, హైకోర్టు కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 30, 2024 03:34 PM IST

TS High Court on Mlc Swearing : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

TS High Court on Mlc Swearing : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటా(Governor Quota)లో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్(Prof. Kodandaram), అమరుల్లాఖాన్ పేర్లను కాంగ్రెస్ సర్కార్ సిఫార్సు చేయగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అయితే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై వివాదం?

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. వీరి పేర్లను గవర్నర్ తమిళి సై ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే అర్హతలు లేవని తిరస్కరించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయింది. తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని కోర్టుకు తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని పేర్కొన్నారు. వీరి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ పై హైకోర్టు(TS High Court) ఏ విషయం తేల్చేవరకూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను(Mlc's) ఎంపిక ఉండబోదని రాజ్ భవన్ వర్గాలు చెప్పాయి. కానీ ఇంతలో ప్రొ.కోదండరామ్, అమీర్‌ అలీఖాన్‌ పేర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాకు ప్రతిపాదించింది. ఈ సిఫార్సుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. తమ పిటిషన్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఆమోదించడంపై దాసోజు శ్రవణ్ , సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దని హైకోర్టు ఆదేశించింది.

గత విచారణలో వాదనలు

ఈ పిటిషన్ పై గత విచారణలో గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. కోర్టు కేసు తేలేవరకు స్టే ఇవ్వాలన్న పిటిషనర్లు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ అభ్యర్థనను తిరస్కరించింది. గవర్నర్‌‌‌‌కు ఏవిధంగా ఆదేశాలు జారీ చేయగలమని పిటిషనర్లను ప్రశ్నించింది. పిటిషనర్ల లాయర్‌‌‌ వాదనలు వినిపిస్తూ కోర్టులో కేసు విచారణ తేలే వరకు గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీల నియామకం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించింది. ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని, నియామకాలపై నిషేధం ఉన్నట్లుగా భావించాలని ఏజీ అన్నారు. అయితే ఈ నియామకంపై తాము వ్యాఖ్యనించమని గత విచారణలో కోర్టు చెప్పింది. ఈ వివాదం కారణంగా నియామకాలపై గవర్నర్‌ ఎలాంటి ‌‌‌ నిర్ణయం తీసుకోకూడదని భావించారని గవర్నర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో గవర్నర్ కోటా నియామకాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. అయితే అనంతరం మారిన పరిస్థితులతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో వీరి ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం