Governor In TS assembly: తెలంగాణ ఇచ్చిన సోనియా, యూపీఏలకు గవర్నర్ ధన్యవాదాలు
Governor In TS assembly: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నాలుగు కోట్ల ప్రజల అకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ, మన్మోహన్ సర్కారు, యూపీఏ ప్రభుత్వాలకు గవర్నర్ ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
Governor In TS assembly: తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై మాట్లాడారు. కొత్త ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు.
ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో సభ్యులుగా ఎన్నికైన వారికి, సిఎంకు, క్యాబినెట్ మంత్రులకు గవర్నర్ తమిళ సై అభినందనలు తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన క్యాబినెట్‌కు గవర్నర్ అభినందనలు తెలిపారు. రాచరికం నుంచి తెలంగాణకు విముక్తి లభించి ప్రజాపాలన మొదలైందని చెప్పారు.
తమ ప్రభుత్వం అందరిక సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అమలు చేయడానికి కట్టుబడి ఉందని గవర్నర్ చెప్పారు. తెలంగాణ ప్రజలఅకాంక్ష నెరవేర్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల అకాంక్షలు, ఆశలను తీరుస్తూ నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గవర్నర్ గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్టు వివరించారు.
ప్రభుత్వం ఏర్పడిన 24గంటల్లో ఆరు గ్యారంటీల్లో రెండు హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చినట్టు చెప్పారు. మహాలక్ష్మీ, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సదుపాయాలను కల్పించినట్టు చెప్పారు. మిగిలిన హామీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజారోగ్యం, వైద్య రంగాల అభివృద్దికి ప్రత్యేక లక్ష్యాలుగా పెట్టుకున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని, కొత్త రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో పదిలక్షల వరకు వైద్య సేవలు లభిస్తాయన్నారు.
నిర్దేశిత కాల వ్యవధిలో మ్యానిఫెస్టోలోపేర్కొన్న మహాలక్ష్మీ, గృహజ్యోతి, యువవికాసం, రైతు బంధు, చేయూత వంటి పథకాలను 100రోజుల్లో అమలు చేస్తామన్నారు. పథకాల అమలుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని గవర్నర్ వివరించారు. రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్, యువత కోసం హైదరాబాద్ డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్ ,కామారెడ్డి డిక్లరేషన్‌లను తప్పక అమలు చేస్తామన్నారు. వ్యవసాయానికి విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు తమ ప్రాధాన్యతలని చెప్పారు.
కాళేశ్వరం అక్రమాలపై విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దక్షిణ తెలంగాణ కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, మేడిగడ్డ-అన్నారం ప్రాజెక్టుల లోపాలపై విచారణ జరిపిస్తామన్నారు. ప్రాజెక్టు అక్రమాల్లో బాధ్యులైన వారిని వదలమన్నారు.
తెలంగాణలో మెగా డిఎస్సీని ఆరునెలల్లో ప్రకటిస్తామని చెప్పారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గవర్నర్ ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందిస్తామని, ఇళ్లు లేని వారికి ఇంటి స్థలాలు, ఐదు లక్షల ఆర్ధిక సాయాన్ని ఇందిరమ్మ పథకంలో అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరో లక్ష అదనంగా ఇస్తామన్నారు. ధరణి స్థానంలో భూమాత ప్రవేశపెడతామన్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడటానికి ప్రత్యేక యంత్రాంగం నెలకొల్పుతామన్నారు.
గతంలో 24లక్షల ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం పంచిందని, పేదలకు భూములు కేటాయిస్తామన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. డ్రగ్స్ మాఫియాను, వాటి వినియోగాన్ని తెలంగాణ నుంచి తరిమి కొడతామన్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, మాదక ద్రవ్యాల కేసుల్లో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. ఖచ్చితంగా అందరిపై చర్యలు ఉంటాయన్నారు.
గత ప్రభుత్వ లోపాల వల్ల భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యాయని, ప్రతి శాఖలో భారీగా అప్పులు పెరిగాయని, ఆర్ధిక క్రమశిక్షణ లోపించిందన్నారు. ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రతి శాఖలో ఉన్న ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రాలను విడుదల చేస్తామని తెలిపారు. ఆర్ధిక నిర్వహణపై కట్టడికి ప్రయత్నిస్తామని దుబారా అరికడతామన్నారు. ఆర్ధిక అవకతవకలపై చర్యలు తప్పవన్నారు.
గత తొమ్మిదిన్నరేళ్లలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేశారని, ప్రభుత్వ సంస్థలను గాడిన పెడతామన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామన్నారు. సెక్రటేరియట్ అందరికి అందుబాటులో ఉంటుందన్నారు.
అమరవీరులు,రైతులు, ఉద్యోగులు, యువత ఆశలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. దాశరథి చెప్పినట్టు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. అంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన వారిందరికి తెలంగాణ ప్రభుత్వం తరపున గవర్నర్ నివాళులు తెలిపారు.