Munugode by election: కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మునుగోడు ఉప ఎన్నిక
Munugode by election: మునుగోడు బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారనుంది.
Munugode by election: తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడూ చర్చనీయాంశమే. దుబ్బాక, హుజురాబాద్, నాగార్జునసాగర్ బై ఎలక్షన్లు తెలంగాణలో పొలిటికల్ ఫీవర్ తీసుకొచ్చాయి.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం
దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతకే అధికార పార్టీ టికెట్ ఇచ్చి సానుభూతి పవనాల కోసం ఎదురుచూస్తూ, అధికార టీఆర్ఎస్ సకల అస్త్రశస్త్రాలను వినియోగించింది.
కానీ న్యాయవాది అయిన బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందనరావు ఇక్కడ సంచలన విజయం నమోదు చేశారు. ఆయన కేవలం వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించినప్పటికీ రాష్ట్రంలో అదొక సంచలనం. తన వాక్పటిమతో రఘునందనరావు ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి కూడా ఉంది. రఘునందన రావు ఎన్నిక బీజేపీకి బాగా ఊపునిచ్చింది. అధికార పార్టీతో ఢీకొట్టే సత్తా బీజేపీకి ఉందన్న రీతిలో తలపడింది. ఆ పార్టీ శ్రేణుల్లో పరిపూర్ణ విశ్వాసం కనిపించడమే కాక, లోక్ సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రజలను ఆకర్షించింది. ఈ ఎన్నిక ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా పడడంతో బీజేపీ సంచలన ఫలితాలు నమోదు చేసింది.
2009లో ఇది కాంగ్రెస్ సీటు. కానీ 2020లో జరిగిన దుబ్బాక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 63,352 ఓట్లు (38.47 శాతం), అధికార టీఆర్ఎస్‌కు 62,273 ఓట్లు (37.82 శాతం) రాగా, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డికి 22,196 ఓట్లు (13.48 శాతం) మాత్రమే లభించాయి.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం..
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక 2021లో జరిగింది. ఇక్కడ 2009, 2014లలో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి గెలుపొందారు. అయితే 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక రావడంతో టీఆర్ఎస్ పార్టీ ఆయన కుమారుడు నోముల భగత్‌కు టికెట్ ఇచ్చింది. సీనియర్ నేత అయిన జానారెడ్డి చేతిలో యువకుడైన భగత్ ఓటమి తప్పదన్న ప్రచారం జరిగినా.. ఆ ఉప ఎన్నికలో భగత్ విజయం సాధించారు. ఇక్కడ భగత్‌కు 89,804 (47.05 శాతం) ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 70.932 (37.16 శాతం) ఓట్లు లభించాయి. బీజేపీకి కేవలం 7,676 ఓట్లు.. అంటే 4.02 శాతం ఓట్లు లభించాయి.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం
2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తూ వచ్చారు. అధికార టీఆర్ఎస్‌లో ఉక్కిరిబిక్కిరి అయి బయటకు వచ్చి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో జరిగిన ఉప ఎన్నిక తెలంగాణలో ఓ సంచలనంగా మారడమే కాకుండా, దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆకర్షించింది. బీజేపీ నుంచి పోటీచేసిన ఈటలకు 1,07,022 (51.96 శాతం) ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 83,167 (40.38 శాతం) ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ 3,014 (1.46 శాతం) ఓట్లు సాధించారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ ఓటమి పాలై, అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఊపుమీద ఉన్నందున 2019 ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.
మునుగోడు ఫలితం ఎలా ఉండబోతోంది?
కాంగ్రెస్‌కు మునుగోడు ఫలితం జీవన్మరణ సమస్య కాబోతోంది. కీలకమైన మూడు ఉప ఎన్నికల్లో (దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్) ఓటమిని సమర్థించుకోవడానికి ఆ పార్టీ ‘అది మా సిట్టింగ్ సీటు కాదు..’ అని వాదించిన సందర్భాలు ఉన్నాయి. అయితే హుజురాబాద్ మినహాయిస్తే దుబ్బాక, నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌కు పటిష్టమైన యంత్రాంగం ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేతగా పనిచేసిన నేత, పీసీసీ అధ్యక్ష పదవికి పోటీపడిన నేత కె.జానారెడ్డి కూడా యువ నాయకుడు భగత్ చేతిలో ఓటమి పాలయ్యారు. అభివృద్ధి ఫలాల కోసం ఉప ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీనే గెలిపిస్తారన్న వాదన కూడా ఈ సందర్భంలో తెరపైకి వస్తుంది.
అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. పైగా కాంగ్రెస్‌కు మెజారిటీ భాగం మద్దతు ఇచ్చే రెడ్డి సామాజిక వర్గం పట్టు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. మరో ఏడాది కాలంలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ప్రజల దృష్టిని కాంగ్రెస్ ఆకట్టుకోవాలన్నా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇవ్వగలదన్న విశ్వాసాన్ని ప్రజల్లో నింపాలన్నా తాజా ఎన్నిక ఒక అందివచ్చిన అవకాశం కాబోతోంది. అయితే ఇది అగ్నిపరీక్ష కూడా కాబోతోంది. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే.. ఇక కాంగ్రెస్ సత్తాపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి.. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బీజేపీ వైపు గంపగుత్తగా మళ్లుతుంది.
కానీ కాంగ్రెస్ ఈ అగ్నిపరీక్షలో నెగ్గడం అంత తేలిక కాదు. టీఆర్ఎస్‌లాగా రాష్ట్రంలో అధికారంలో లేదు. బీజేపీలాగా కేంద్రంలో అధికారంలో లేదు. కెప్టెన్‌గా ఆడడం రేవంత్ రెడ్డికి కొత్తే. పైగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే గిట్టదు. తనను కాదని, నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై గుర్రు మీదు ఉన్న వెంకటరెడ్డి సాంకేతికంగా కాంగ్రెస్‌లో ఉన్నా.. తమ్ముడే గెలవాలని కోరుకునే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తమ్ముడు పార్టీని వీడిన అనంతరం కూడా విభిన్న కారణాలతో రేవంత్ రెడ్డిపై వెంకట్ రెడ్డి నిప్పులు చెరగడం ఇదే సంకేతాన్ని ఇస్తోంది.
అయితే మునుగోడులో ఇటీవలి బహిరంగ సభ కాంగ్రెస్‌లో కాస్త విశ్వాసాన్ని నింపగలిగింది. ఇక బీజేపీ గెలుపు అనివార్యమయ్యే పరిస్థితి వస్తుందని గమనిస్తే ఇక్కడ వామపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు కూడా కాంగ్రెస్‌కే పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సరైన అభ్యర్థిని ఎంచుకుని మునుగోడు ఉప ఎన్నిక అనే అగ్ని గుండంలో దూకి సత్తా నిరూపించుకోవడమే మిగిలి ఉంది.
సంబంధిత కథనం