T Congress: మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం ఉంటుందా..? -suspense on mp komatireddy venkat reddy decession over campaign for munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Suspense On Mp Komatireddy Venkat Reddy Decession Over Campaign For Munugodu Bypoll

T Congress: మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం ఉంటుందా..?

Mahendra Maheshwaram HT Telugu
Aug 05, 2022 03:11 PM IST

తెలంగాణ కాంగ్రెస్ కు మునుగోడు సవాల్ గా మారింది. సిట్టింగ్ స్థానం కావటంతో దడ మొదలైంది. బైపోల్ ఖరారు అయితే... అభ్యర్థిగా ఎవర్నీ ఉంచాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న వేళ... స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మౌనం... ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో)
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో) (twitter)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..... సీనియర్ కాంగ్రెస్ లీడర్..! 3 దశాబ్ధాల రాజకీయ చరిత్ర.. ! నల్గొండ జిల్లాలో ఆయనకంటూ ప్రత్యేక పేరు..! అందులోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే... ఓ బ్రాండ్ అనే చెప్పొచ్చు..! సొంత బలం ఉన్న నేతలుగా పేరుంది. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పటంతో... అందరి చూపు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డిపై పడింది. ఆయన ఎలా స్పందిస్తారు.. ? ఉప ఎన్నికలో తమ్ముడి వైపా...? లేక పార్టీ వైపా అన్న చర్చ ఓ లెవల్ లోనే జరుగుతోంది. ఇంతలోనే రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వెంకట్ రెడ్డి. ఏకంగా తనని రెచ్చగొట్టొద్దని... క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నారు..? మునుగోడులో పార్టీ తరపున ప్రచారం చేస్తారా..? తమ్ముడిపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టగలరా...? లేక మౌనంగా ఉండటమే బెటర్ అనే లిస్ట్ ఆప్షన్ ను ఎంచుకుంటారా..? అన్నది పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పరిధిలోనే మునుగోడు నియోజకవర్గం కూడా ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక బైపోల్ రావటమే మిగిలి ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓ క్లారిటీతోనే ఉంది. చర్చలు జరపుతూనే... ప్లాన్ బీ ని కూడా సెట్ చేసింది. ఓవైపు రాజీనామా ప్రకటించారో లేదో... పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ లెవల్ లో ఫైర్ అయ్యారు. బ్రాండ్ కాదు బ్రాందీ షాపులో కూడా పని చేయడానికి పనికి రారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఓ లేఖ బయటికి వచ్చింది. మునుగోడు నియోజకవర్గంలోని తాజా పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కన్వీనర్ గా ఓ కమిటి ఏర్పాటైంది. ఇందులో దామోదర్ రెడ్డి, సీతక్క తో పాటు పలువురు నేతల పేర్లు ఉన్నాయి. కానీ స్థానిక పార్లమెంట్ సభ్యుడైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేదు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ వ్యాఖ్యలు, కమిటీ ఏర్పాటుపై సమాచారం లేకపోవటం, పార్టీ మారుతారని ప్రచారం చేయటం వంటి అంశాలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలకు పైగా పార్టీ కోసం పని చేస్తున్నానని... తెలంగాణ కోసం మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన వ్యక్తినని అని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి చేసిన బ్రాందీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. అనవసరంగా తనని రెచ్చగొట్టొదని వార్నింగ్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పార్టీ మారారని... రేవంత్ రెడ్డి అలా చేయలేదు కాదా అని సూటిగా ప్రశ్నించారు. పార్టీ మార్పు గురించి వెంకట్ రెడ్డిని అగడటమేంటని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కాంగ్రెస్‌కు మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్న తనను, తన కుటుంబాన్ని అవమానపరిచేలా రేవంత్‌ మాట్లాడినా, మాణిక్యం ఠాగూర్‌ తప్పుపట్టకపోవడాన్ని పలువురి దగ్గర వెంకట్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

సమావేశానికి దూరం..!

ఇక శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. అయితే ఈ సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన... ఫైనాన్స్‌ కమిటీ సమావేశం దృష్ట్యా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు. అయితే పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేసే వారికి లీగల్ నోటీసులు ఇస్తానని వెంకట్ రెడ్డి హెచ్చరించారు. 4 పార్టీలు మారి కాంగ్రెస్ లోకి రాలేదని... 35 ఏళ్లుగా కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మరోవైపు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... వెంకట్ రెడ్డి సమావేశానికి వస్తారని చెప్పటం మరో కొసమెరుపు..!

మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ లో పెద్ద దుమారేనే రేపుతోంది. ఉప ఎన్నిక ఖరారు అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి మాత్రం సైలెన్స్ గా ఉండటం... పార్టీ కేడర్ ను డైలామాలో పడేస్తోంది. ఫ్యామిలీ వేరు పాలిటిక్స్ వేరు అని చెబుతున్న వెంకట్ రెడ్డి... మునుగోడు విషయంలో మాత్రం... క్లారిటీ ఇవ్వటం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారా...?అనే దానిపై స్పష్టత రావటం లేదు. విస్తృత స్థాయి సమావేశానికి దూరంగా ఉంటానని ప్రకటన చేయటంతో.... హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే సొంత తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఎందుకనే భావనలో వెంకట్ రెడ్డి ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కనీసం కమిటీ ఏర్పాటుపై సమాచారం ఇవ్వకపోవటం, పార్టీ మార్పుపై అనుమానాలతో తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో.... ఆయన ఉప ఎన్నిక విషయంలో మౌనంగా ఉండే ఛాన్స్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది.

స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ముందుకెళ్తుందనేది కూడా ఇంట్రెస్టింగ్ మారింది. ఆయనతో మాట్లాడి బైపోల్ ప్రచారానికి సిద్ధమయ్యేలా చేస్తారా..? లేదా అనేది చూడాలి...!

IPL_Entry_Point