CM Revanth Reddy : దీపావళి అంటే మాకు చిచ్చు బుడ్లు, వాళ్లకు సారా బుడ్లు- ఫామ్ హౌస్ పార్టీపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
CM Revanth Reddy : నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియా చిట్ చాట్ లో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందన్నారు. ఫామ్ హౌస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లోని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనపై ముందడుగే వేస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించామన్నారు. డిసైడ్ అయ్యాక ఇక వెనక్కి వెళ్లేది లేదన్నారు. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మూసీ ప్రాజెక్టులో భాగంగా ముందుగా బాపూఘాట్ నుంచి పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నవంబర్ నెలలో మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మూసి ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే రూ.140 కోట్లతో డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చామన్నారు. మూసీ నిర్వాసితులకు ఉచితంగా విద్య, అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
21 కి.మీ మేర మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి
మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తనను నేరుగా కలవవచ్చని, తనను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలకు అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి తమ అభ్యంతరాలు చెప్పొచ్చన్నారు. బాపూఘాట్ నుంచి వెనక్కి 21 కి.మీ మేర మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోందన్నారు. విచారణ సంస్థల రిపోర్టుల ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని, ఆపై కేసీఆర్ అనే పదమే తెలంగాణ రాజకీయాల్లో కనిపించదన్నారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు నడుస్తున్నాయన్నారు. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుందన్నారు. త్వరలోనే కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్ ను వాడతామన్నారు. బావను ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసన్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయన్నారు. దీనిని దీపావళి పార్టీ అని ఎలా అంటారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఫామ్ హౌస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మాకు దీపావళి అంటే చిచ్చు బుడ్లు, వాళ్లకు మాత్రం సారా బుడ్లు అని విమర్శించారు. దీపావళి దావత్ అలా చేస్తారని తమకు తెలియదన్నారు. తప్పేంచేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయారని సీఎం ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నిస్తు్న్నారన్నారు. ఫ్యామిలీ పార్టీలో క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
సంబంధిత కథనం