IND vs AUS 4th Test: నాలుగో టెస్టుకు తుదిజట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. 19ఏళ్ల బ్యాటర్ అరంగేట్రం.. ఎవరీ ఆటగాడు?
Australia Final XI 4th Test: భారత్‍తో నాలుగో టెస్టుకు తుది జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. మ్యాచ్‍కు ఒక రోజు ముందే టీమ్‍ను వెల్లడించింది. 19ఏళ్ల బ్యాటర్ అరంగేంట్రం చేయనున్నాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు రేపు (డిసెంబర్ 26) మొదలుకానుంది. ప్రస్తుతం ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. తొలి మ్యాచ్‍లో భారత్ గెలువగా.. రెండో పోరులో ఆసీస్ గెలిచింది. వర్షం ప్రభావం చూపిన మూడో టెస్టు సమమైంది. ఈ నాలుగో టెస్టు గెలిచిన జట్టు సిరీస్‍లో ఆధిక్యంలోకి వెళుతుంది. అందుకే ఇరు జట్టు పక్కా ప్రణాళికలు, కొన్ని మార్పులతో వస్తున్నాయి. నాలుగో టెస్టు కోసం ఒక్క రోజు ముందే నేడు (డిసెంబర్ 25) తుది జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. తుది జట్టులో రెండు మార్పులు చేసింది. 19 ఏళ్ల ప్లేయర్ ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు.
రెండు మార్పులు ఇవే
మూడో టెస్టుతో పోలిస్తే తుది జట్టులో ఆస్ట్రేలియా రెండు మార్పులను చేసింది. ఓపెనర్ నాథన్ మెక్‍స్వానీని తప్పించింది. ఆ స్థానంలో 19ఏళ్ల బ్యాటర్ సామ్ కొన్స్‌టాస్‍ను జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‍తోనే అంతర్జాతీయ క్రికెట్‍లో అతడు అరంగేట్రం చేయనున్నాడు. ఆసీస్ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్నాడు. గాయం పాలైన పేసర్ జోస్ హాజిల్‍వుడ్ స్థానంలో తుదిజట్టులో స్కాట్ బోలండ్‍కు ఆసీస్ తుది జట్టులో చోటు దక్కింది.
ఎవరీ సామ్ కొన్స్‌టాస్.. రికార్డు ఇదే
ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా సామ్ కొన్స్‌టాస్ రికార్డు సృష్టించనున్నాడు. దేశవాళీ క్రికెట్‍లో కొన్స్‌టాస్ సత్తాచాటుతున్నాడు. న్యూసౌత్ వేల్స్ తరఫున ఇప్పటి వరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍ల్లో 718 పరుగులతో అదరగొట్టాడు కొన్స్‌టాస్. 2 సెంచరీలు, మూడు అర్ధ శతకాలు చేశాడు. ఆడింది తక్కువ మ్యాచ్‍లే అయినా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో సెలెక్టర్లు అతడికి ఛాన్స్ ఇచ్చేశారు. భారత్‍తో నాలుగో మ్యాచ్‍తో టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేయనున్నాడు సామ్ కొన్స్‌టాస్. ఇటీవలే బిగ్‍బాష్ లీగ్‍లోనూ కొన్స్‌టాస్ అడుగుపెట్టాడు. సిడ్నీ థండర్స్ తరఫున తన తొలి మ్యాచ్‍లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
హెడ్ జట్టులోనే..
భారత్‍తో టెస్టు సిరీస్‍లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‍లో రెండు సెంచరీలు బాదాడు. అయితే, మూడో టెస్టులో హెడ్‍కు గాయమైంది. దీంతో నాలుగో టెస్టుకు ఉంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, అతడు గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో నాలుగో టెస్టు తుదిజట్టులో హెడ్ కొనసాగాడు.
భారత్‍తో నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్స్‌టాస్, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, స్కాట్ బోలాండ్