హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్ అయిపోయిందని.. గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరిస్తామన్న రేవంత్.. మూసీ నిర్వాసితులకు ఒక మంచి జీవితాన్ని ఇద్దామని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఖాతాలో రూ.15 వందల కోట్లు ఉన్నాయని.. రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా? అని అడిగారు. విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తామని.. అందరు ముందుకొచ్చి సూచనలు ఇవ్వాలని కోరారు.
'ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదు. మూసీ మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం. మూసీ ప్రాంత పేదల జీవితాలు బాగుపడొద్దా.. మూసీ ప్రాంతంలో 10 వేల కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది.. మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి.. మూసీ బాధితులను ఆదుకోలేమా' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం. బఫర్‌జోన్‌లో ఇళ్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తాం. ఫాంహౌస్‌లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారు. ప్రత్యామ్నాయం అడిగితే చెప్పరు. చెరువుల ఆక్రమణలతో మన బతుకులు సర్వనాశనం అవుతాయి. గత ఎండాకాలం బెంగళూరులో నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. చెరువులు, నాలాలు పోయి, చివరకు మూసీ కూడా పోతే నగరం ఎలా వరద భరిస్తుంది' అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కారు ఫోకస్ పెట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం అప్పగించారు. పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సూచించారు.
అటు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది.