Musi Politics: రాజకీయ రంగు పులుముకున్న మూసీ ప్రక్షాళన..ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఉద్యమించాలన్న గుత్తా సుఖేందర్
Musi Politics: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రాజకీయ రంగు పులుముకుంది. మూసీ కాలుష్యంతో ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతంగా నల్గొండ జిల్లా ఉంది. హైదరాబాద్ నుంచి వస్తున్న మూసీ మురికి నీటితో ఇక్కడ పంటలు సాగవుతున్నాయి. భువనగిరి, తుంగతుర్తి, సూర్యాపేట, హుజూర్ నగర్, మిర్యాలగూడెం పరిధిలో మూసీ నది ప్రవహిస్తోంది.
Musi Politics: మూసీ కాలుష్యం, నది ప్రక్షాళనపై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఉద్యమించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరి నియోజకవర్గం పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవేశించే మూసీ, చివరకు మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం వాడపల్లి వద్ద క్రిష్ణా నదిలో త్రివేణి సంగమం వద్ద కలుస్తుంది.
మొత్తంగా అయిదు నియోజకవర్గాల గుండా ప్రవహించే మూసీ నదిపై నకిరేకల్ నియోజకవర్గం సోలిపేట గ్రామం వద్ద ప్రాజెక్టు ఉంది. మూసీ నీటిపై ఆధారపడి 42వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అయితే, పూర్తిగా కాలుష్యపూరిత నీటితో పంటలు సాగు చేస్తుండడం, దిగుబడులు అమ్ముకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇక్కడి చెరువుల్లోని మత్స్య సంపదను మార్కెట్ చేయడం కూడా సమస్యగా మారింది. ఈ కారణంగానే మూసీ ప్రక్షాళనకు డిమాండ్ పెరుగుతోంది. అయితే, మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుపై విమర్శలు వస్తున్నాయి. మూసీ రివర్ బెడ్ లో ఉన్న ఇళ్ళను తొలగిండం, ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను, కబ్జాలను తొలిగించేందుకు పూనుకోవడంతో విపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఎదురు దాడి మొదలైంది.
సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై గురువారం మీడియా సమావేశం కూడా జరిపి మూసీ సుందరీకరణ కాదని, తాము చేస్తోంది మూసీ పునరుజ్జీవనమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు, మూసీ పరివాహక ప్రాంతం రైతులు, ప్రజల నుంచి మద్దతు వస్తోంది దీనిలో భాగంగానే నల్గొండ జిల్లాకే చెందిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాన్ని సమర్థిస్తూ మద్దతు ప్రకటించారు.
జిల్లా ప్రజలు ఉద్యమించాలి - శాసన మండలి చైర్మన్ గుత్తా
మూసీ నది ప్రక్షాళన పై బీఆర్ఎస్, బీజేపీ తీరును శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత ప్రధానిగా వాజ్ పాయ్ ఉన్న హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడిందని గుర్తు చేశారు.
సీఎం హోదాలో కేసీఆర్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుకు వచ్చారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వెయ్యికిపైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుత్తా వివరించారు. ప్రభుత్వ కార్యక్రమానికి మద్దతు ప్రకటించేందుకు ఆయన శుక్రవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితువు పలికారు.
అన్నింటికీ రాజకీయ కోణం విమర్శించడం సమంజసం కాదని, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని కోరారు. అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )