Harish Rao : పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిండు కదా.. మీరెందుకు ఇవ్వరు.. రేవంత్‌పై హరీష్ రావు ఫైర్-brs top leader harish rao criticizes chief minister revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao : పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిండు కదా.. మీరెందుకు ఇవ్వరు.. రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

Harish Rao : పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిండు కదా.. మీరెందుకు ఇవ్వరు.. రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

Basani Shiva Kumar HT Telugu
Sep 17, 2024 04:45 PM IST

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు మాజీమంత్రి హరీష్ రావు. ప్రజాపాలన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు 4 వేలు పింఛన్ ఇస్తుంటే.. తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

హరీష్ రావు
హరీష్ రావు

మెదక్‌లో పర్యటించిన మాజీ మంత్రి హరీష్‌రావు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పదవిని అడ్డుపెట్టుకుని రేవంత్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాపాలన ప్రసంగంలో రేవంత్ అబద్ధాలు చెప్పారన్న హరీష్.. ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదులపై నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. 2024 మార్చి వరకు తీసుకున్న అప్పులను..గత ప్రభుత్వంపై నెడుతున్నారని అన్నారు. దివాలా అంటూ రాష్ట్ర పరపతిని దిగజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి చూపాలని వ్యాఖ్యానించారు.

'పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు రూ.4,26,000 కోట్లు మాత్రమే. రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఏమో గత ప్రభుత్వంలో చేసిన అప్పు రూ.6,85,000 కోట్లు అని చెప్పాడు, ఇప్పుడేమో రూ.7 లక్షల కోట్లు చిల్లర అని చెప్తున్నాడు. పెంచుకుంటూ పోతున్నాడు. రాష్ట్రం దివాల, దివాల అంటే రాష్ట్రానికి పరువు ఉంటదా.. ఉన్నది చెప్పాలి కానీ లేనిది ఎవడన్న చెప్తాడా' అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

'ఎంతసేపు అప్పులు అప్పులు అంటూ మాట్లాడుతున్నారు కదా.. మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడవు. తెలంగాణ ఏర్పడిన నాడు 2013-14లో మన తలసరి ఆదాయం రూ.1,12,162. ఇవాళ రూ.3,47,229కి పోయుంది. దేశంలో నంబర్ 1 తెలంగాణ అయ్యింది. జీఎస్డీపీ రాష్ట్రం ఏర్పడిన నాడు రూ.4,51,000 కోట్లు ఉంటే ఈనాడు రూ.14,63,000 కోట్లకు పెంచారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణను అగ్రబాగన నిలబెట్టిన కేసీఆర్ గురించి, తలసరి ఆదాయం గురించి నోరు ఎందుకు రాదు' అని హరీష్ రావు ప్రశ్నించారు.

'పక్క రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే.. 4 వేల పింఛన్లు ఇచ్చిండు కదా.. నువ్వు ఎందుకు ఇయ్యవు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే పింఛన్ 2 వేలు ఇచ్చిండు' అని హరీష్ రావు గుర్తు చేశారు.

అటు కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. 'కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు.. చార్లెస్ బాబేజీ. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిండని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. టాటా వారు 1956లో ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్ గాంధీకి అప్పటికి 12 సంవత్సరాలు. ఎదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు.. నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్ వీటికి పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి' అంటూ కేటీఆర్ సెటైర్లు పేల్చారు.

Whats_app_banner