KCR Districts Tour : రైతుల దగ్గరికి కేసీఆర్, ఎండిన పంట పొలాల పరిశీలన - రేపు పలు జిల్లాల్లో పర్యటన
KCR District Tour Updates: బీఆర్ఎస్ అధినేత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. రేపు జనగామతో పాటు పలు జిల్లాల్లో పర్యటిస్తారు.
KCR Districts Tour : తెలంగాణలో చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేక చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమిపిస్తున్నారు. నీళ్ల ట్యాంకర్లతో పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) రైతులను కలిసేందుకు సిద్ధమయ్యారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు.
కేసీఆర్ జిల్లాల పర్యటన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపట్నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీన జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లోని పంటలను పరిశీలించి…. రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. కేసీఆర్ పర్యటనకు(KCR Tour) సంబంధించి… ఇప్పటికే ఆ పార్టీ నేతలు షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలిసింది.
మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో(Karimnagar)నూ భూగర్భ జలాలు అడుగంటాయి. సాగునీటి కాలువలు వట్టిపోయాయి. పంటపొలాలు నెర్రలు బారాయి. పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటపొలాలను చూసి దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కొందరు బావుల్లో పూడిక తీస్తుండగా మరికొందరు ట్యాంకర్ ల ద్వారా పంటపొలాలకు నీటి సప్లై చేస్తున్నారు. నీటి వసతి లేని రైతులు ఎండిన పంటలను పశువులకు మేతగా మార్చుకుంటున్నారు. మరికొందరు కడుపు మండి నిప్పంటించి తగులబెడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే వెలాది ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది. సిరిసిల్ల, మానకొండూర్, కరీంనగర్, హుస్నాబాద్ నియోజకవర్గాలో పంటనష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండిపోయిన పంటలకు ఎకరాన 30 వేల రూపాయల పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేకుంటే పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు పంటల పొలాలు ఎండిపోవడంతో బిఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి లో ఎండిన పంటలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. సాగునీరు లేక పంటలు ఎండి పుట్టెడు దుఃఖంతో ఉన్న రైతులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు. పంటలు ఎండడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. రైతులను చూస్తే బాధేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ వద్ద కుంగిపోయిన మూడు పిల్లర్లను భూతద్దంలో చూపెడుతు రైతులకు సాగునీరు ఇవ్వడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, కేసిఆర్ పై కడుపుమంటతో మేడిగడ్డ ను రిపేర్ చేయకుండా రైతుల పంటలను ఎండబెడుతుందని ద్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆవేదనతో ఆందోళన చెంది ఆత్మహత్య లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడి కుటుంబాలను ఇబ్బంది పెట్టవద్దని.. మీకోసం కెసిఆర్ త్వరలో వస్తారని తెలిపారు. రైతులు ధైర్యంగా ఉండండి, మేం ఉన్నాం అంటూ దైర్యం చెప్పారు.