Nalgonda BJP: నల్గొండ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.. పార్టీలో చేరిన వెంటనే టిక్కెట్ ఖరారు
Nalgonda BJP: అనుకున్నట్టే నల్గొండ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరు ఖరారైంది. పార్టీలో చేరిన వెంటనే టిక్కెట్ తెచ్చుకున్నారు.
Nalgonda BJP: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) BJPఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు స్థానాలకు తమ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే భువనగిరి నుంచి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ను తొలి జాబితాలో ప్రకటించిన బీజేపీ నాయకత్వం, మలి జాబితాలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని నల్గొండ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. రెండు రోజుల కిందటే ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి మూడో రోజుకే లోక్ సభ అభ్యర్థిత్వాన్ని సొంతం చేసుకున్నారు.
2018లో ఎన్నికల అరంగేట్రం
కెనడాలో హోటల్ బిజినెస్ లో ఉన్న శానంపూడి సైదిరెడ్డి Sanampudi Saidireddy ఎన్.ఆర్.ఐ గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ Huzur Nagar నియోజకవర్గం నుంచి తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ Sankaramma ను నాటి టీఆర్ఎస్ పోటీకి పెట్టింది. అప్పటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయింది.
దాదాపు అయిదేళ్లపాటు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆమె ఉన్నా.. అప్పటికే గులాబీ రాజకీయాల్లో క్రియాశీలంగా తయారైన శానంపూడి సైదిరెడ్డిని 2018 ముందస్తు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. 2014లో ఓటమి పాలైన శంకరమ్మను పక్కన పెట్టి సైదిరెడ్డిని పోటీకి నిలిపినా మరో మారు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో శానంపూడి సైదిరెడ్డికి ఓటమే మిగిలింది.
కలిసొచ్చిన 2019 ఉప ఎన్నిక
లోక్ సభకు 2019లో జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి Utatm Kumar Reddy నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో హుజూర్ నగర్ శాసన సభాస్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
2019లోనే హుజూర్ నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి శానంపూడి సైదిరెడ్డి రెండో సారి అప్పటి టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేయగా, ఆ ఎన్నికల్లో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిని ఆయన పై వివిధ కారణాలతో నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిపోయి, దాని ప్రభావం 2023 ఎన్నికలపై పడి ఓటమి పాలయ్యారు.
ఇలా బీజేపీలో చేరి.. అలా ఎంపీ టికెట్
శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలో సైదిరెడ్డి చురుగ్గానే ఉన్నారు. ఒక దశలో బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీ టికెట్ కావాలని కూడా కోరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితునిగా పేరున్న సైదిరెడ్డికి టికెట్ వచ్చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అయ్యింది.
ఈ అంచాలన్నింటినీ తలకిందులు చేస్తే.. తన దగ్గరి అనుచరులకు కూడా మాట మాత్రం చెప్పకుండా ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనుచరుల్లో, కార్యకర్తల్లో విమర్శలు రావడంతో.. ఏ పరిస్థితుల్లో తాను బీఆర్ఎస్ ను వీడాల్సి వచ్చింది.., ఎందుకు బీజేపీలో చేరాల్సి వచ్చిందీ వివరిస్తూ ఒక ఆడియో విడుదల చేశారు.
ఈ పరిణామాలన్నీ కలిపి కేవలం మూడు రోజుల వ్యవధిలో జరిగినవే కావడం గమనార్హం. , బుధవారం (13వ తేదీ) బీజేపీ నాయకత్వం ప్రకటించిన మలి జాబితాలో ఆయన నల్గొండ ఎంపీ టికెట్ సాధించారు. వాస్తవానికి నల్గొండ ఎంపీ స్థానం పరిధిలో బీజేపీకి నామమాత్రంగా కూడా బలం లేదు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాపై ఆధారపడి బీజేపీ ఎన్నికల్లో పోటీ పడుతోంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి ఏ మేరకు ప్రభావం చూపగలుగుతారు..? ఎన్నికల్లో విజయం సాధిస్తారా..? ఇతర పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేయగులుగుతారా అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సి ఉంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )
సంబంధిత కథనం