Telangana Tourism : కృష్ణమ్మ అలలపై 120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణం.. పర్యాటకులకు కార్తీకమాసం కానుక!-boat trip from nagarjunasagar to srisailam begins under the auspices of telangana tourism ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Tourism : కృష్ణమ్మ అలలపై 120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణం.. పర్యాటకులకు కార్తీకమాసం కానుక!

Telangana Tourism : కృష్ణమ్మ అలలపై 120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణం.. పర్యాటకులకు కార్తీకమాసం కానుక!

Basani Shiva Kumar HT Telugu
Nov 02, 2024 03:05 PM IST

Telangana Tourism : పర్యాటకులకు తెలంగాణ టూరిజం కార్తీకమాసం కానుక ఇచ్చింది. నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణాన్ని ప్రారంభించింది. కృష్ణమ్మ అలలపై 120 కిలో మీటర్లు, 6 గంటలు ప్రయాణించే అద్భుత అవకాశాన్ని కల్పించింది.

కృష్ణమ్మ అలలపై ప్రయాణం ప్రారంభం
కృష్ణమ్మ అలలపై ప్రయాణం ప్రారంభం

ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బోటు ప్రయాణం ప్రారంభం అయ్యింది. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు అద్భుత బోటు ప్రయాణాన్ని కార్తీకమాసం తొలిరోజు తెలంగాణ పర్యాటకశాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్లాన్ చేస్తున్నప్పటికీ.. నాగార్జునసాగర్ డ్యాంలో సరైన మట్టంలో నీటి లభ్యత లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తృత స్థాయిలో వర్షాలు పడ్డాయి. దీంతో కృష్ణానది తీరం వెంట, అటు శ్రీశైలం నుండి ఇటు నాగార్జునసాగర్ డ్యామ్ వరకు గరిష్ట స్థాయిలో నిరుంది. దీంతో తెలంగాణ పర్యాటక శాఖ ఇవాళ నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు ఈ బోట్ (లాంచ్ ) ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ లాంచ్ ప్రయాణానికి.. మొట్టమొదటి రోజున తెలంగాణ తోపాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు.

నాగార్జున సాగర్ నుండి నందికొండ మీదుగా, ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంతాల అందాలను చూసేలా లాంచీ ప్రయాణం సాగుతోంది. మరొక టూరిజం ప్యాకేజీని కూడా అందుబాటులోకి తెచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా నేడు అందుబాటులోకి తెచ్చింది. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు నేడు ప్రారంభించారు.

శ్రీశైలం వరకు (120 కిలోమీటర్లు) 7 గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ లాంచీ ప్రయాణానికి పెద్దలకు 2 వేల రూపాయలు, పిల్లలకు 1,600 రూపాయల టికెట్‌ ధర నిర్ణయించారు. ఒకవైపు మాత్రమే. ఇది కేవలం జ‌ర్నీకి సంబంధించిన రుసుము మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలంలో రూమ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ వంటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడిపిస్తారని టూరిజం ఆఫీసర్ కే. వెంకటరమణ వివరించారు.

Whats_app_banner