Floods 2022 : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నాగర్జున సాగర్ కు కూడా వరద వస్తొంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 530.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312,0405 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిలువ 169.5116 టీఎంసీలుగా ఉంది.
కృష్ణా నదిపై ప్రాజెక్టులకు వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు శ్రీశైలం డ్యామ్ కూడా కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం శ్రీశైలం డ్యామ్‌కు ఎగువన ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ), తుంగభద్ర నదితో పాటు డ్యామ్ సమీపంలోని పరివాహక ప్రాంతాల నుంచి 31,736 క్యూసెక్కులు మాత్రమే వచ్చాయి. ఆదివారం 2.97 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా, ఔట్‌ఫ్లోలు 1,313 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లోలు గణనీయంగా పెరిగాయి. పూర్తిస్థాయి రిజర్వాయర్ మట్టం 885 అడుగులకు గానూ ప్రాజెక్టు నీటిమట్టం 859.60 అడుగులకు చేరుకుంది.
డ్యాం ఎగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్ల వద్ద నియమించిన అధికారుల సమన్వయంతో శ్రీశైలం డ్యాంలో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.61 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 23 స్పిల్‌వే గేట్ల ద్వారా 1.66 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తుండటంతో జూరాల, శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో మరింత పెరగనుంది.
అయితే వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్‌ఎస్‌పీ)కి ఇన్ ఫ్లో తక్కువగా వస్తోంది. ప్రస్తుతం 16,848 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఇన్‌స్టంట్ ఔట్ ఫ్లో 3,334 క్యూసెక్కులు మాత్రమే.
మరోవైపు గోదావరి నదిలోని ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లో పడిపోయింది. 17,150 క్యూసెక్కులు మాత్రమే వస్తుండడంతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పి) అధికారులు గేట్లను మూసివేశారు. అయితే మళ్లీ వరద పెరగడంతో తెరిచారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి 38వేల 510 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేసి దిగువ గోదావరి నదిలోకి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద కాలువ ద్వారా పదివేల క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. మెుత్తం 9 గేట్లను ఎత్తి నీటిని వదిలారు.