Greater Warangal BRS: గ్రేటర్ వరంగల్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి మేయర్, కార్పొరేటర్లు..-big shock to brs in greater warangal mayor corporators join congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Greater Warangal Brs: గ్రేటర్ వరంగల్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి మేయర్, కార్పొరేటర్లు..

Greater Warangal BRS: గ్రేటర్ వరంగల్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి మేయర్, కార్పొరేటర్లు..

HT Telugu Desk HT Telugu
Mar 04, 2024 09:33 AM IST

Greater Warangal BRS: రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా చెప్పుకునే గ్రేటర్ వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరగా తాజాగా నగర మేయర్ గుండు సుధారాణి, మరి కొందరు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి

Greater Warangal BRS: గ్రేటర్ వరంగల్  Mayorమేయర్ గుండు సుధారాణి Gundu SudhaRani పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. గుండు సుధారాణి ఆదివారం సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నేడో, రేపో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇతర ప్రముఖుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

కాంగ్రెస్ బాట పట్టిన కార్పొరేటర్లు

అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. కిందిస్థాయి, పైస్థాయి వరకు లీడర్లంతా కాంగ్రెస్ బాట పట్టారు. ఇందులో భాగంగానే గ్రేటర్ వరంగల్ కు చెందిన 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ మొదట కాంగ్రెస్ లో చేరారు.

ఆ తరువాత ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద, 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, 48వ డివిజన్ కార్పొరేటర్ షరాజ్ బేగం, 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస, 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత హస్తం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు కొందరు మాజీ కార్పొ రేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు.

తాజాగా వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోని మరో 15 మంది కార్పొ రేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో 12వ డివిజన్ కార్పొరేటర్ కావేటి కవిత, 13వ డివిజన్ సురేష్ జోషి, 18వ డివిజన్ వస్కుల బాబు, 19వ డివిజన్ ఓని స్వర్ణలత భాస్కర్, 21వ డివిజన్ ఎండీ. పుర్కాన్, 22వ డివిజన్ బస్వరాజు కుమారస్వామి, 27వ డివిజన్ చింతాకుల అనిల్, 28వ డివిజన్ గందె కల్పన నవీన్, 32వ డివిజన్ పల్లం పద్మ, 33వ డివిజన్ ముష్కమల్ల అరుణ, 34వ డివిజన్ దొడ్డి కుమారస్వామి, 35వ డివిజన్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, 38వ డివిజన్ బైరబోయిన ఉమా దామోదర్, 39వ డివిజన్ సిద్ధంరాజుబాబు, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ ఉన్నారు. ఓ వైపు మేయర్ గుండు సుధారాణి, మరో వైపు 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు వేర్వేరుగా ఆదివారం హైదరాబాద్ తరలి వెళ్లారు.

కాంగ్రెస్ ఖాతాలోకే మేయర్ పీఠం!

అసెంబ్లీ ఎన్నికల తరువాత గ్రేటర్ వరంగల్ greater Waranagal Mayor మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. దీంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్‌కు తీసుకొచ్చేందుకు వరంగల్ తూర్పులో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చక్రం తిప్పగా.. వరంగల్ వెస్ట్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పావులు కదిపారు.

కార్పొరేటర్లను చేర్చుకున్న తరువాత మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయ్యారు. కానీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు కనీసం మూడేళ్ల పదవీకాలమైనా పూర్తి కావాలనే నిబంధన ఉండగా, మే 3వ తేదీ నాటికి మేయర్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆ తరువాత మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు సన్నద్ధం అయ్యారు.

ఈ నేపథ్యంలో తన పదవిని కాపాడుకునేందుకు మేయర్ గుండు సుధారాణి పాత టీడీపీ వర్గంతో లాబీయింగ్ జరిపినట్లు తెలుస్తోంది. గతంలో ఆమె టీడీపీలో పని చేసిన వ్యక్తే కావడంతో పాటు ఆ పార్టీ లీడర్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉండటంతో వారి ద్వారా పైరవీలు చేసినట్లు సమాచారం.

ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరులైన మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , భూపాలపల్లి, డోర్నకల్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, రామచంద్రునాయక్ ద్వారా మంతనాలు జరిపి, చివరకు కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలిసింది.

అయినా టెన్షన్ లోనే మేయర్!

మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యినప్పటికీ ఆమెకు టెన్షన్ తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనుండగా.. మేయర్ పీఠం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చినట్లయ్యింది.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే మేయర్ పీఠం దక్కుతుందనే ప్రచారం జరగగా.. ఇప్పుడు గుండు సుధారాణి కూడా కాంగ్రెస్ లోకి చేరడంతో కొంత సందిగ్ధం ఏర్పడింది. మేయర్ గా ఆమెనే కొనసాగిస్తారా.. లేదా మరెవరికైనా అవకాశం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. కాగా వచ్చే మే నెల మొదటివారంలోనే మేయర్ పీఠంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point