Bathukamma Festival : తీరొక్క పూల పండగ... తెలంగాణ 'బతుకమ్మ'
Bathukamma Festival in Telangana: బతుకమ్మ అనగానే.. తెలంగాణ ప్రజలకు ఓ ప్రత్యేకమైన పండగ. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా… పూలను పూజించే పండగ ఒక్క తెలంగాణలో మాత్రమే కనిపిస్తోంది. తొమ్మిదిరోజులపాటు ఈ పండగను చేసుకుంటారు.
Bathukamma Festival in Telangana : దేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి.. ఇందులో సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే వాటికి మనదేశంలో విశిష్ట స్థానం ఉంది. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ రకాల పండుగలు జరుపుకుంటాం. అందులో బతుకమ్మ పండుగకు విశిష్ట స్థానం ఉంటుంది. తెలంగాణ అంటేనే బతుకమ్మ…. బతుకమ్మ అంటేనే తెలంగాణ అనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పండుగలు నిర్వహిస్తోంది.
ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ మన రాష్ట్రంలో కొనసాగుతోంది. తిరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మను కొని ఆడతారు. ఆడబిడ్డలను ఇంటికి పిలుచుకొని కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు, బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. అశ్వయుజ అమావాస్యనాడు ఎంగిలి పూల పేరుతొ ఎంగిలికాని పూలతొ పేర్చిన బతుకమ్మతో మొదలై… తొమ్మిది రోజులు కొనసాగి దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడ మగ వయోభేదం లేకుండా ఈ పండుగలో పాలుపంచుకుంటారు.
తెలంగాణలో బతుకమ్మ పండగకు ఉన్నంత ప్రాముఖ్యత మరే పండగకు ఉండదు. భాద్రపద అమవాస్య నుంచి దుర్గాష్టమి వరకు అంటే తొమ్మిది రోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో బతుకమ్మను పేరుస్తూ.. ఊరూవాడా ఏకమై పండగ చేసుకుంటారు.
మెుదటి రోజు ఏం చేస్తారు…
ఈ పూల పండగ భాద్రపద అమావాస్యతో మెుదలు పెడతారు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి పూలు, చామంతి.. ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. మెుదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. మెుదటి రోజున.. అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండో రోజు…
ఇక రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఇది అశ్వయుజ మాసం మెుదటి రోజైన పౌడ్యయమి రోజున నిర్వహిస్తారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.
మూడో రోజు..
మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈరోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.
నాలుగో రోజు..
బతుకమ్మ పండుగలో నాలుగో రోజున నానబియ్యం బతుకమ్మను చేస్తారు. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు.
ఐదో రోజు
ఐదోరోజు అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు అట్లు(దోసలు) తయారు చేస్తారు. అమ్మకు నైవేద్యంగా పెడతారు.
ఆరో రోజు
ఈ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు.
ఏడో రోజు
ఏడో రోజును వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి.. నూనెలో వేయిస్తారు. అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు
ఈరోజును వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లంలాంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
తొమ్మిదో రోజు
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. చాలా ముఖ్యమైన రోజు. ఇదే రోజు అశ్వయుజ అష్టమి.. దుర్గాష్టమి. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం,, నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు.
సద్దుల బతుకమ్మ చివరి రోజు.. బతుకమ్మను పేర్చి ఆడిపాడతారు. అనంతరం బతుకమ్మను తల మీద పెట్టుకుని ఊర్లో చెరువు వరకూ ఊరేగింపుగా వెళతారు. పాటలు పాడుతూ.. బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. తర్వాత తెచ్చుకున్న ప్రసాదం అందరికీ పంచిపెట్టుకుంటారు.