Rythu Bandhu Updates : ‘అప్పుడే బ్యాంకులకు వెళ్లండి’... రైతుబంధు స్కీమ్ తాజా అప్డేట్ ఇదే
Telangana Rythu Bandhu Scheme: రైతుబంధు కింద ఇచ్చే పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పటికీ… డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అయితే ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది వ్యవసాయశాఖ.
Telangana Rythu Bandhu Scheme: రైతుబంధు నిధుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అయితే నిధులు ఎప్పుడొస్తాయా అంటూ రైతన్నలు ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ రావటంతో… ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధుల జమపై ఆదేశాలు కూడా ఇచ్చింది. గతంలో ఉన్న స్కీమ్ కు అనుగుణంగానే నిధులను జమ చేయాలని సూచించింది. త్వరలోనే రైతుభరోసాగా మార్చి… జమ చేయాలని నిర్ణయించింది. అయితే సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ… నిధులు జమ ప్రక్రియ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటి వరకు కేవలం ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అయినట్లు సందేశాలు వస్తున్నాయి.
నిధులు జమ కొనసాగుతోంది - వ్యవసాయశాఖ
ఇక గ్రామాల్లోని చాలా మంది రైతులు… బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే రైతుబంధు నిధుల జమకు సంబంధించి… వ్యవసాయశాఖ నుంచి కీలక అప్డేట్ అందింది. ప్రస్తుతం ఒక గుంట నుంచి(0.01-1.00) ఒక ఎకరా లోపు రైతులకు...రైతు బంధు నిధుల జమ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపింది. ఇక ఎకరా లోపు ఉన్న రైతులకు పూర్తి అయిన తర్వాత ఎకరా నుంచి రెండు ఎకరాల(1:01-2:00) వరకు రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో నిధులు జమ అవుతాయని పేర్కొంది. రోజుకీ ఎకరా వారీగా కాకుండా యాసంగి సీజన్ పూర్తి అయ్యేలోపు అందరి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని…. కావున రైతులు బ్యాంక్ ల చుట్టూ తిరగకుండా ఫోన్లకి మెసేజ్ వచ్చిన తర్వాతనే బ్యాంకులకు వెళ్ళాలని సూచించింది. కేవలం ఈసారి కొత్త పాస్ బుక్ వచ్చిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని… గతంలో రైతుబంధు పొందినవారు ఎలాంటి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చింది. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుంది.